ఖాళీ కంచాలతో నిరసన
మచిలీటపట్నం(చిలకలపూడి) :
తమకు కడుపునిండా అన్నం పెట్టాలని కోరుతూ వసతిగృహాల విద్యార్థులు ఖాళీ కంచాలతో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన కార్యక్రమం జరిగింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.నూర్మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 199, రెండో దశలో 272 వసతిగృహాలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఇందుకోసం జీవో నంబరు 89 జారీ చేసిందని చెప్పారు. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో నంబరు 89ను వెంటనే రద్దు చేయాలని, వసతిగృహాలు మూసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలన్నారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఎస్ఐఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రవీణ్, ఎం.మహేష్, నాయకులు ఎన్.సోమేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు, కె.రామకృష్ణ, ఎం.అనిల్, సీహెచ్ సుమన్, వసతిగృహాల విద్యార్థులు పాల్గొన్నారు.