ఎనస్తటిస్ట్‌ల కొరతతో ఎన్ని కష్టాలో!
=అరకొరగా మత్తు మందు వైద్యులు
=నగరంలో 400 ఆస్పత్రులకు 125 మందే గతి
=సర్జన్లు, రోగులకు తప్పని నిరీక్షణ
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : నగర ఆస్పత్రులను ఎనస్తటిస్ట్‌ల(మత్తు మందు వైద్యులు) కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేజీహెచ్‌తోపాటు సుమారు 400కుపైగా చిన్నాపెద్దా ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఉన్నాయి. వీటిలో రోజుకు 800 నుంచి 1000 శస్త్ర చికిత్సల వరకు జరుగుతుంటాయి, ఇంత పెద్ద మొత్తంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన సర్జన్లు అందుబాటులో ఉన్నా వాటికి సారథ్యం వహించే ఎన స్తటిస్ట్లు మాత్రం అరకొరగానే ఉన్నారు.
నగరం మొత్తమ్మీద వీరి సంఖ్య 125కి మించి లేదంటే నమ్మశక్యం కానప్పటికీ ముమ్మాటికి ఇదే నిజమంటున్నారు నగర ఎనస్తటిస్ట్‌ల సంఘం కార్యదర్శి డాక్టర్ కె.కూర్మనాథ్. ప్రపంచ ఎనస్తటిస్ట్‌ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. నగరంలోని ఆస్పత్రుల్లో, కేజీహెచ్‌లో ఎనస్తటిస్ట్‌ల కొరత తీవ్ర సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు.
ఒక ఆస్పత్రిలో రోగికి ఆపరేషన్ జరుగుతుండగా అదే సమయంలో మరో మూడు ఆస్పత్రుల్లో అదే ఎనస్తటిస్ట్ రాక కోసం సర్జన్లు, రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నగరంలో ఉందన్నారు. నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో ఆపరేషన్ల అవసరాలు తీరాలంటే ఇప్పుడున్న ఎనస్తటిస్ట్లకు అదనంగా మరో 30 శాతం వరకు అయినా పెరగాల్సి ఉంటుందని చెప్పారు.
కేజీహెచ్‌లోనూ అదే పరిస్థితి
కేజీహెచ్ లో కూడా ఎనస్తటిస్ట్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ సర్జరీలతో కలుపుకొని రోజుకు వంద వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఆస్పత్రులో ఉన్న పది ఆపరేషన్ థియేటర్లో మొత్తం 32 ఆపరేషన్ టేబుళ్లు ఉండగా, కేవలం 34 మంది ఎనస్తటిస్ట్లే ఇక్కడ ఉండడం విశేషం. ఒక్కో వైద్యుడు రోజుకు సగటున 3 నుంచి 4 ఆపరేషన్లకు హాజరు కావల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ఎమర్జెనీ ఆపరేషన్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. 30 ఏళ్ల క్రితం కేజీహెచ్‌లో ఉన్న నాలుగు ఎనస్తషీయా యూనిట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎనస్తటిస్ట్‌ల కొరత తీరే విధంగా ప్రభుత్వం సీట్ల సంఖ్య పెంచాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.