‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.