ఆయన నోరు విప్పితే..
దేవాదాయ శాఖ ఏసీ పుష్పవర్థన్‌పై ఉద్యోగుల తిరుగుబాటు
మితిమీరిన ఆయన వేధింపులు, బూతు పురాణాలు
వ్యక్తిగత దూషణలు.. మహిళా ఉద్యోగులపై వ్యంగ్యబాణాలు
ఆ అధికారి మాకొద్దని.. కమిషనర్‌కు వినతి
సామూహిక సెలవులు పెట్టేస్తామని హెచ్చరిక
ఆయన నోరు విప్పితే.. బూతు పురాణమే.. మహిళా ఉద్యోగులు కనిపిస్తే.. వ్యంగ్యాస్త్రాలే.. తోటి సిబ్బంది, అధికారులపై అంతులేని ఏహ్యభావం..ఆచారాలు.. సంప్రదాయాలు తృణప్రాయం.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?..పవిత్రతకు, ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారి.. జిల్లాలోని ఆ శాఖ కార్యకలాపాలన్నింటినీ చక్కదిద్దాల్సిన అసిస్టెంట్ కమిషనర్.. కంచే చేను మేసిన చందంగా ఆ ఉన్నతాధికారే ఇంత నీచంగా వ్యవహరిస్తే.. ఇంకెవరికి చెప్పుకోవాలి..అందుకే కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు సదరు ఏసీగారిపై తిరగబడ్డారు..ఆ అధికారి మాకొద్దంటూ.. విశాఖ పర్యటనకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధకు తెగేసి చెప్పారు.
సాక్షి, విశాఖపట్నం: ఎన్నాళ్లుగానో ఆయన బూతు పురాణాలను, వ్యంగ్యాస్త్రాలను భరిస్తూ వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది.. ఇక ఓపిక పట్టలేకపోయారు. జిల్లా అధికారి అయిన సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ ఆగడాలపై ఒకరూ ఇద్దరూ కాదు.. నగర, జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు తిరుగుబాటు చేశారు.
విశాఖ పర్యటనకు వచ్చిన ఆ శాఖ కమిషనర్ అనురాధకు మొరపెట్టుకున్నారు. జిల్లా దేవాదాయశాఖ చరిత్రలోనే తొలిసారి ఒక అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిపై మూకుమ్మడిగా ఫిర్యాదు చేసి కలకలం రేపారు. ఏ అధికారికైనా వ్యతిరేకులతోపాటు అనుకూలురు ఉండడం సహజం. కానీ ఈ పుష్పవర్థన్‌కు మాత్రం ఆ శాఖలో కింద నుంచి పై వరకు అన్ని విభాగాల ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
దాదాపు నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నారు. కిందిస్థాయి వారినే కాదు.. పైస్థాయి అధికారులను హేళన చేస్తుంటారని ఉద్యోగులు ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించడం, తాను డెరైక్ట్‌గా నియమితుడినై వచ్చానంటూ లెక్కచేయని తనంతో విర్రవీగడం ఆయనకు అలవాటుగా మారిందని వీరు ఆవేదన చెందుతున్నారు. పై గా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈయనను రాష్ట్ర విభజన సమయంలో ఇక్కడ నుంచి సాగనంపుతారని అప్పట్లో అంతా భావించారు. కానీ అది జరగకపోవడంతో మరింతగా ఉద్యోగులను వేపుకుతింటున్నారని ఉద్యోగవర్గాలు వాపోతున్నాయి.
ఉద్యోగినుల పట్ల అసభ్యవర్తన
మహిళా ఉద్యోగుల పట్ల ఆయన వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత పెరిగింది. ఉన్నతాధికారి నోట నుంచి బూతులు వస్తుంటే ఆ మహిళామణులు సిగ్గుతో తలదించుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ద్వంద్వార్థాలు, వెకిలి చేష్టలతో వేధింపులకు పాల్పడుతున్నారని వీరు బావురుమంటున్నారు.
తనకు అనుకూలంగా లేని ఉద్యోగులను వివాదాస్పద ప్రాంతాలకు పంపించి కక్ష సాధిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. ఈ శాఖ ఉద్యోగులు మరణించినా ఆ కుటుంబాల పట్ల అమానవీయంగానే ఉంటారని చెబుతారు. ఏసీ పుష్పవర్థన్ వేధింపులను భరించలేకే సోమవారం నగరంలోని ఎర్నిమాంబ ఆలయ ఈవో బి.త్రిమూర్తులు మరణించారంటూ వీరంతా ఆవేదన చెందుతున్నారు. ఇలా లెక్కలేనన్ని అరాచకాలతో సహనాన్ని కోల్పోయారు.
జిల్లాలో ఆయన కింద పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులు మంగళవార ం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏసీ పుష్పవర్థన్‌ను తక్షణమే ఇక్కడ నుంచి బదిలీ చేయకపోతే తామంతా బుధవారం నుంచే సామూహిక సెలవులు పెట్టేస్తామని కమిషనర్‌కు వారు తెగేసి చెప్పేశారు. ఆయన స్థానంలో కొత్త ఏసీని నియమించేదాకా తాము విధుల్లో చేరబోమని స్పష్టం చేశారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న కమిషనర్ అనురాధ పుష్పవర్థన్‌పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణమే అమరావతి రావలసిందిగా పుష్పవర్థన్‌ను ఆదేశించారు. కమిషనర్ స్పందనను చూసి ఇప్పటికైనా ఏసీ పుష్పవర్థన్ లీలలకు ఫుల్స్టాప్ పడుతుందన్న ఆశాభావంతో దేవాదాయశాఖ ఉద్యోగులున్నారు.
నా భార్యకు వైద్యం చేయించే అవకాశం లేదు
అనకాపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా విధులు చేపట్టి 11 నెలలవుతున్నా ఇంతవరకూ జీతం ఇవ్వలేదు. ఇటీవల నా భార్యకు తీవ్రమైన జబ్బు చేయడంతో అప్పులు చేసి, భార్య పుస్తెలమ్మి ఆమెకు వైద్యం చేయించాల్సి వచ్చింది. భార్యకు బాగులేదన్నా సెలవు మంజూరు చేయకుండా తీవ్రంగా హింసించాడు.
-టి.ఎన్.ఎస్.శర్మ, ఈవో అనకాపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం
ఆత్మాభిమానం దెబ్బతింటోంది
కష్టపడి పనిచేస్తున్నా నోటికి వచ్చినట్టు తిడుతూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాడు. దేవాదాయ ఆస్తులను కాపాడుతూ ఆలయాల అభివద్ధికి కషి చేస్తున్న మమ్మల్ని అగౌరవ పరచడమే పుష్పవర్థన్ విధిగా పెట్టుకున్నారు. ఈవో త్రిమూర్తులు మరణించినా మేమంతా వెళ్లడానికి నిరాకరించడం దుర్మార్గం. అతడి అకత్యాలను భరించలేకనే సామూహిక సెలవులు పెడుతున్నాం.
-లక్ష్మీనారాయణ, విశాఖ ఆర్ అండ్ బి-భూసమేత వేంకటేశ్వరస్వామి ఆలయం ఈవో
మహిళలను మానసికంగా వేధిస్తున్నాడు
మహిళలని కూడా చూడకుండా మానసికంగా వేధిస్తున్న అసిస్టెంట్ కమీషనర్ పుష్పవర్థన్‌ను వెంటనే బదిలీ చేయాలి. మీకిస్తున్న జీతాలు దండుగని సోమరిపోతుల్లా పనిచేస్తున్నారని ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు తిట్టడం వల్ల మానసికంగా కుంగిపోతున్నాం - రమాబాయి, ఈవో, శంకరమఠం రామలింగేశ్వరాలయం-విశాఖపట్నం
ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం
పుష్పవర్ధన్ ఆకృత్యాలపై ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. స్త్రీలను గౌరవించడం తెలియని వ్యక్తివద్ద పనిచేయలేం. ఆంధ్రా ఉద్యోగులపై తెలంగాణ అధికారి పెత్తనం చేయడం సహించలేకపోతున్నాం. కష్టనష్టాలకు ఓర్చి పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నాం. దొడ్డిదారిన, కష్టపడకుండా ఉద్యోగం రాలేదు. పుష్పవర్ధన్ ఈ విషయాన్ని గుర్తించడం లేదు.
-శిరీష, ఈవో, ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయం-విశాఖపట్నం