‘శక్తిమిల్స్’ కేసుల్లో ఇద్దరు బాలలు దోషులుగా నిర్ధారణ
ముంబై: ముంబైలోని పాడుబడిన శక్తి మిల్స్‌లో జరిగిన రెండు సామూహిక అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరు బాలలను దోషులుగా జువెనైల్ జస్టిస్ బోర్డు(జేజేబీ) మంగళవారం నిర్ధారించింది. సత్ప్రవర్తన అలవర్చుకునేలా వారిద్దరినీ మూడేళ్లపాటు నాసిక్‌లోని బోస్టన్ స్కూల్లో ఉంచాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. సామూహిక అత్యాచారం తదితర సెక్షన్ల కింద ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జి.బి.జాదవ్, సభ్యులు మేరీలతో కూడిన బోర్డు నిర్ధారించిందన్నారు.
ఇద్దరు బాలల్లో ఒకరిని 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ చేయగా.. మరొకరిని 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్ట్ చేశారు. గతేడాది జూలైలో శక్తిమిల్స్ ప్రాంగణంలో 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారం జరగ్గా.. గత ఆగస్టు 22న అదే ఆవరణలో 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపైనా గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడడం తెలిసిందే.