engineering goods
-
ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో రికార్డు
కోల్‌కతా: ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొన్నట్లు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాల మండలి (ఈఈపీసీ) చైర్మన్ మహేశ్ దేశాయ్ వెల్లడించారు. 2021 సెప్టెంబర్‌లో ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు తొమ్మిది బిలియన్ డాలర్లను దాటాయి. ఎగుమతులకు సంబంధించి మొత్తం 25 ప్రధాన దేశాలకు సంబంధించి 22 దేశాల విషయంలో మంచి సానుకూల గణాంకాలు వెలువడినట్లు వివరించారు. ఇందులో చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), జర్మనీ, టర్కీ, ఇటలీ, బ్రిటన్, మెక్సికో, వియత్నాం, సింగపూర్ వంటి దేశాలు ఉన్నాయన్నారు. మొత్తం భారత్ ఎగుమతుల్లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల వాటా 26.65 శాతం. 2022 మార్చి నాటికి 105 బిలియన్ డాలర్ల లక్ష్యం 2021 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ వరకూ చూస్తే, భారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 32.4 బిలియన్ డాలర్ల నుంచి 52.3 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఈఈపీసీ చైర్మన్ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో (2022 మార్చి నాటికి) 49 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, లక్ష్యం సాకారమైతే ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల విలువ 105 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరు దేశాలు, ట్రేడింగ్ బ్లాక్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వేగవంతం చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని దేశాయ్ స్వాగతించారు. అయితే ఇటువంటి ముందస్తు ఒప్పందాల వల్ల చోటుచేసుకున్న ప్రతికూల ప్రభావాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ‘‘ముందస్తు సంతకం చేసిన ఎఫ్‌టీఏ వల్ల కొరియా, జపాన్ వంటి దేశాల నుండి ఫెర్రస్, నాన్–ఫెర్రస్ రంగాలలోని కొన్ని వస్తువుల దిగుమతులు గణనీయంగా పెరిగిపోయాయి. అందువల్ల కొత్త ఎఫ్‌టీఏలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
ఎగుమతులు రివర్స్‌గేర్
న్యూఢిల్లీ: భారత్ ఆరి్థక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి–దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాశాలను చూస్తే... ► ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్ డాలర్లు. 2018 ఆగస్టుతో పోలి్చతే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్ గూడ్స్ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్ ప్రొడక్టులు ఉన్నాయి. ► దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టుతో పోలి్చతే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్ 14 శాతంగా ఉంది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్ డాలర్లు. ► ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏడాదంతా నిరుత్సాహమే... భారత్ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆరి్థక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఎగుమతులు పెరిగాయ్... దిగుమతులు తగ్గాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్ డాలర్లు. కాగా అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. ► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో నీరసం 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2019 జూన్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎగుమతులపై ప్రతికూల అవుట్‌లుక్‌ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్ ట్రేడ్ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ. అంతర్జాతీయ ప్రతికూలత ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్టీ తక్షణ రిఫండ్ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. – శరద్ కుమార్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రూపాయి క్షీణత ప్రభావమే.. జూన్ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ -
ఎగుమతుల్లో కొనసాగుతున్న నిరుత్సాహం
వరుసగా 16 నెలా క్షీణతే... * మార్చిలో -5.47 శాతంగా నమోదు * 2015-16లో 16 శాతం పతనం న్యూఢిల్లీ: ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చిలో 2015-15 ఇదే కాలంతో పోల్చితే) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది. ఒక్క మార్చిని చూస్తే... ఎగుమతులు -5 శాతం క్షీణతతో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా క్షీణ బాటలోనే ఉన్నాయి. - 22 శాతం పతనంతో 28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి-దిగుమతుల మధ్య విలువ వ్యత్యాసం వాణిజ్యలోటు 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల క్షీణత మొత్తం పరిణామంపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితి దీనికి కారణం. చమురు దిగుమతుల విలువ 36 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు యేతర దిగుమతుల విలువ 18 శాతం క్షీణతలో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇలా... 2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ ఎగుమతులు 16 శాతం క్షీణించాయి. 310 బిలియన్ డాలర్ల నుంచి 261 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా ఇదే స్థాయిలో క్షీణించి 380 బలియన్ డాలర్లకు పడ్డాయి. దీనితో వాణిజ్యలోటు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో 119 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. బంగారం వెలవెల... కాగా మార్చిలో పసిడి దిగుమతులు 80 శాతం క్షీణించాయి. 5 బిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. 17వ నెలా మైనస్‌లోనే టోకు ద్రవ్యోల్బణం * మార్చిలో -0.85% నమోదు * క్రూడ్, తయారీ విభాగాల్లో తక్కువ ధరల పతనం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు మార్చిలోనూ అసలు పెరుగుదల లేకపోగా ‘మైనస్’ను నమోదుచేసుకుంది. ఈ నెలలో రేటు క్షీణతలో -0.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 మార్చితో పోల్చితే 2016 మార్చిలో ధరల సూచీ అసలు పెరక్కపోగా... తగ్గిందన్నమాట. ఇటువంటి ధోరణి ఇది వరుసగా 17నెల. క్రూడ్, తయారీ విభాగాల ధరలు దిగువస్థాయిలో ప్రతిబింబించడం దీనికి ప్రధాన కారణం. కాగా కూరగాయలు, ఆహార ధరలు రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూచీ రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణుల వాదన. వార్షికంగా 3 విభాగాలూ వేర్వేరుగా.. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో కూడిన ఈ విభాగం రేటు 2015 మార్చిలో క్షీణతలో -0.17 శాతంగా ఉంటే ఇప్పుడు ఈ రేటు 2.13 శాతానికి ఎగసింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ రేటు 6.27 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గింది. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -6.94 శాతం క్షీణత నుంచి 8.09 శాతం పైకి చేరింది. ఇంధనం, లైట్: ఈ రేటులో క్షీణ రేటు -12.23 శాతం నుంచి -8.30కి చేరింది. తయారీ: ఈ విభాగంలో క్షీణత రేటు సైతం -0.19 శాతం నుంచి 0.13 శాతానికి దిగింది. ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇలా... కూరగాయల ధరలు వార్షికంగా అసలు పెరక్కపోగా -2.26 శాతం తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.47 శాతం, పప్పు దినుసుల ధరలు 35 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 2 శాతం తగ్గాయి.