విద్యార్థుల ‘ప్రగతి’ కోసం...
షాబాద్, న్యూస్‌లైన్ : విద్యార్థుల ‘ప్రగతి’ కోసం విద్యాశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన ప్రగతి వివరాలను ఏడాదికి ఒక సారి మాత్రమే నమోదు చేసేవారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో సంవత్సరంలో విద్యార్థులు సాధించిన వివరాలతో పాటు వరుసగా ఐదేళ్లకు సంబంధించిన ప్రగతిని ఒకే కార్డులో నమోదు చేయొచ్చు. ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరుతో ‘బాల్యానికి భరోసా... బాల ఆరోగ్య రక్ష’ నినాదంతో ఈ కార్డులను అందుబాటులోకి తెచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ ప్రగతి కార్డులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. గతంలో విద్యార్థుల మార్కుల వివరాలను మాత్రమే అందించేవారు. ప్రస్తుత విధానంలో వాటితో పాటు ఆరోగ్య వివరాలు, సాధించిన నైపుణ్యం, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతి, విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు తదితర అంశాలను పొందుపరుస్తారు. విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో విద్యార్థికి సంబంధించిన వివిధ అంశాలను తల్లిదండ్రులు క్షుణ్ణంగా గమనించే వీలు కలుగుతుంది.
గ్రేడింగ్ పద్ధతి...
విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ను ఇచ్చే పద్ధతిని విద్యాశాఖ అమలు చేస్తోంది.
91 నుంచి 100మార్కులు సాధించిన విద్యార్థి అత్యున్నత ప్రతిభ కనబర్చినట్లుగా ఏ ప్లస్ గ్రేడు ఇస్తారు.
71 నుంచి 90మార్కులు సాధించిన విద్యార్థికి ఏ గ్రేడు కేటాయిస్తారు.
51 నుంచి 70మార్కులు సాధించిన విద్యార్థికి ఇంకా కృషి చేయాలంటూ బీ ప్లస్ గ్రేడును ఇస్తారు.
41 నుంచి 50మార్కులు సాధించిన విద్యార్థికి బీగ్రేడు ఇస్తారు.
0 నుంచి 40మార్కులు సాధించిన విద్యార్థికి నామామాత్రపు చదువుగా భావించి సీ గ్రేడు ఇస్తారు.
ఉపాధ్యాయులు ఏం చేయాలంటే...
{పతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి సంగ్రహాత్మక, నిర్మాణాత్మక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థిస్థాయి వివరాలను కార్డుల్లో నమోదు చేయాలి.
{పగతి కార్డులను తల్లిదండ్రులకు పంపి వారి సంతకాలతో పాటు సూచనలు, సలహాలు సేకరించాలి.
విద్యార్థుల ప్రగతిపై సమీక్షలు నిర్వహించి తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సమక్షంలో సమావేశాలు నిర్వహించాలి.
విద్యార్థులు వెనుకబడిన విషయాలను గుర్తించి మెరుగుపర్చుకోవాలి.
విద్యార్థి పాఠశాలను వీడుతున్నా లేదా మారుతున్న సమయంలో కార్డు చివరన ఉన్న ధృవీకరణ పత్రాన్ని విద్యార్థికి అందజేయాలి.
కార్డుల్లో నమోదు చేయాల్సిన వివరాలు...
నిరంతర మూల్యాంకనం ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వివిధ అంశాల్లో సాధించిన ప్రగతిని ఉపాధ్యాయులు ప్రగతి కార్డుల్లో నమోదు చేయాలి.
విద్యార్థి బడిలో చేరిన నాటి నుంచి బయటకు వెళ్లే వరకు విద్యార్థి ఫొటోతో పాటు చదువులో సాధించిన ప్రగతి, నైపుణ్యం, ఆరోగ్య వివరాలు, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతిని పొందుపర్చాలి.
విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు వివరాలను ఎప్పటికప్పుడు కార్డుల్లో నమోదు చేస్తుండాలి.
తల్లిదండ్రులకు సమీక్షించుకునే అవకాశం...
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు ప్రగతి కార్డులను సరఫరా చేశాం. వీటితో విద్యార్థికి సంబంధించిన విద్యా విషయాలు, ఆరోగ్య సమస్యలు, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతితో పాటు రక్తం గ్రూపు, ఎత్తు, బరువు లాంటి ప్రగతిని తల్లిదండ్రులు సమీక్షించుకునే అవకాశం లభిస్తుంది.-అంగూర్‌నాయక్, ఎంఈఓ, షాబాద్