పింఛన్ల పంపిణీలో చేతివాటం
ఓజిలి: సామాజిక పింఛన్ మొత్తాన్ని ఐదు రెట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పంపిణీపై పర్యవేక్షణను గాలికొదిలేసింది. ఈ క్రమంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదరిస్తూ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తంలో కోతపెడుతున్నారు. రూ.200 నుంచి రూ.300 వరకు అక్రమంగా వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఓజిలి మండలంలో కొత్తగా 348 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
డిసెంబర్లో వారికి రెండు నెలలకు సంబంధించిన మొత్తాన్ని అందజేశారు. వెంకటరెడ్డిపాళెం పంచాయతీ రాజుపాళెంలో ఇటీవల పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీపతి సుబ్బమ్మ, బల్లి లక్ష్మయ్య, తిరుమలశెట్టి శంకరమ్మ తదితరుల నుంచి పంచాయతీ కార్యదర్శి జనార్దన్ కొంత మొత్తం వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే రద్దయిన పింఛన్లను మళ్లీ పునరుద్ధరించిన నేపథ్యంలో కొంత నగదు చెల్లించాల్సిదేనని స్పష్టం చేశారని లబ్ధిదారులు వాపోయారు. సగుటూరు ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన శనగా బుజ్జమ్మ, శనగా రమణమ్మ, తూపిలి మణెయ్య, వీర్లగునపాడుకు చెందిన జడపల్లి పుల్లయ్యకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని, ఇలా కోత పెడితే తాము ఎలా బతకాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.200 పింఛన్ ఇచ్చే సమయంలోనూ అధికారులు ఇలాగే వ్యవహరించే వారని, ఇప్పుడు కూడా వారి తీరు మారలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెండు నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై విచారణ జరపాలని కోరుతున్నారు.
రూ.300 తీసుకున్నారు
వితంతు పింఛన్ కింద రెండు నెలలకు గాను నాకు రూ.2 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని నాకు ఇచ్చినందుకు రూ.300 ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి జనార్దన్ చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే కొంత పింఛన్‌కు ఇవ్వాల్సిందేనన్నారు. చిల్లర మార్చుకుని వచ్చి రూ.300 ఇచ్చా.
శ్రీపతి సుబ్బమ్మ, రాజుపాళెం
ఇవ్వాల్సిందేనన్నారు
నాకు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. అక్టోబర్‌లో సాంకేతిక లోపమని నిలిపేశారు. అధికారులకు విన్నవిస్తే పునరుద్ధరించారు. రెండు నెలలకు గాను రూ.2 వేలు మంజూరైతే రూ.300 అడిగి మరీ తీసుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. బల్లి లక్ష్మయ్య, రాజుపాళెం
రూ.వెయ్యి లాక్కున్నారు
నాకు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ మంజూ రైంది. స్థానిక పాఠశాలలో పంచాయతీ కార్యదర్శి 2 వేలు ఇచ్చారు. బయటకు రాగానే వెయ్యి రూపాయలు తీసేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. శనగా బుజ్జమ్మ, సగుటూరు
నగదు తిరిగి ఇప్పించాలి
మా పంచాయతీ కార్యదర్శి నాకు రూ.2 వేలు ఇచ్చి మళ్లీ రూ.వెయ్యి వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే కొత్త పింఛన్ మంజూరు చేసినందుకని చెప్పారు. అధికారులు విచారించి ఆ నగదు నాకు ఇప్పించాలి.
తూపిలి మణెయ్య, సగుటూరు
ఫిర్యాదు చేస్తే విచారిస్తా
పింఛన్ల పంపిణీ విషయంలో అక్రమాలు జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటా. విజయేంద్రకుమార్, ఎంపీడీఓ, ఓజిలి