భారత్ జవాబుదారీ కాదు
పారిస్ ఒప్పందంపై వైట్‌హౌస్ ప్రకటన
వాషింగ్టన్: పారిస్ వాతావరణ ఒప్పందంలో కర్బన ఉద్గారాలపై భారత్, చైనా వంటి దేశాలను జవాబుదారీ చేయడం లేదని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొంది. ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. 2030 వరకూ చైనా కర్బన ఉద్గారాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోదని, భారత్‌కు 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయం అందేవరకూ ఎటువంటి బాధ్యతలు లేవని వైట్‌హౌస్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) స్కాట్ ప్రుయిట్ చెప్పారు. ఏడాదిన్నర క్రితం పారిస్ ఒప్పందాన్ని 150కిపైగా దేశాలు ఆమోదించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఒప్పందం నుంచి తప్పు కోవాలని ట్రంప్ సాహ సోపేతమైన నిర్ణయం తీసుకున్నారని స్కాట్ కొనియాడారు. అమెరికాలో గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదలను 26 నుంచి 28 శాతం వరకూ తగ్గించగలిగామని, క్లీన్ పవర్ ప్లాన్, వాతావరణ యాక్షన్ ఎజెండా ద్వారా ఇది సాధిం చగలిగామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకు న్నారని, వాతావరణ ఒప్పందాలను, అంతర్జాతీయ చర్చలను తమ దేశం గౌరవిస్తుందని అన్నారు. కాగా, భారత్, చైనాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని అమెరికాకు చెందిన ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ అనే వెబ్ బేస్డ్ మీడియా స్పష్టం చేసింది.
పారిస్ ఒప్పందం వందలాది బొగ్గు ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైనాను అనుమతిస్తోందని, 2020 నాటికి భారత్‌లో బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు సహకరిస్తోందని, కానీ అమెరికాలో ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిం చడం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే.. అమెరికా ఎంతో ముందుందని, అయినా చైనా, భారత్ పర్యావరణానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు అంగీకరించాయని, ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం అమెరికాలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఆర్థికంగా భారంగా మారాయని, దీనికి ఇతర మార్గాల్లో తక్కువ ధరకే విద్యుత్ లభించడమే కారణమని ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ మేనేజింగ్ ఎడిటర్ లోరి రాబిన్సన్ స్పష్టం చేశారు.