EPC policy
-
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్)లో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ విగ్రహం ఏర్పాటుకు ఈపీసీ విధానంలో ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయాన్ని రూ.180 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 14 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలి. టెండర్ డాక్యుమెంట్లు శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతిస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 249 కోట్లతో పార్కు అభివృద్ధి స్వరాజ్ మైదాన్‌లో సుమారు 20 ఎకారల విస్తీర్ణంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ అండ్ డెవలప్మెంట్ పార్కును రూ.248.71 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం కింద భాగంలో జీ+1 తరహాలో 2,000 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా కన్వెన్షన్ సెంటర్, ధ్యాన మందిరం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించడంతో ఏపీఐఐసీ విగ్రహ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. -
కిలోమీటర్‌కు 17.23 కోట్లు!
♦ రాజధాని రహదారుల నిర్మాణంలో సర్కార్ మరో మాయాజాలం ♦ 98 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారుల అంచనా వ్యయం రూ.1520.28 కోట్లు ♦ రూ.3 కోట్ల ఖర్చుతో కిలోమీటర్ మేర జాతీయ రహదారి నిర్మాణం ♦ వర్షం నీటి పైపులు, విద్యుత్ కేబుల్ పనుల ఖర్చు కలిపినా రూ.5 కోట్లు దాటదంటున్న నిపుణులు ♦ అమరావతిలో మాత్రం సప‘రేటు’పై అధికారుల విస్మయం ♦ ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించిన ఏడీసీ సాక్షి, అమరావతి: నూతన రాజధాని ముసుగులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులకైనా చుక్కలనంటేలా భారీ అంచనాలను రూపొందిస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు 6,020 రూపాయల వ్యయం చేసిన సర్కారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల నివాస ప్లాట్లకు ఏకంగా ఒక్కో ప్లాట్‌కు 1.40 కోట్ల రూపాయలను అంచనాగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాల శాశ్వత నిర్మాణాల వరకు సబ్ ఆర్టీరియల్ (ఎక్కువ ట్రాఫిక్ సామర్థ్యం) రహదారుల నిర్మాణాలకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) అదే రీతిలో అంచనాలు తయారు చేసింది. వర్షం నీరు, విద్యుత్ కేబుల్, మంచినీటి పైపులతో సహా 98.77 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.1520.28 కోట్ల అంచనాగా రూపొందించింది. మూడు ప్యాకేజీలుగా ఈ రహదారుల నిర్మాణాలకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ)లో టెండర్లను ఆహ్వానించింది. ఈ రహదారుల అంచనాలను చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారులకు కిలో మీటర్‌కు (సర్వీసు రోడ్లతో సహా) మూడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షం నీరు, మంచి నీరు, విద్యుత్ కోసం వేర్వేరుగా పైప్లైన్లు, కేబుల్ వేసినప్పటికీ కిలో మీటర్‌కు 5 కోట్ల రూపాయలకు మించి వ్యయం కాదని చెబుతున్నారు. అలాంటిది సగటున కిలో మీటర్‌కు 17.23 కోట్ల రూపాయల మేర అంచనాలను రూపొందించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ నంబర్ 8 : 22.93 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) రూ.435.20 కోట్లు. అంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.18.97 కోట్లు. ప్యాకేజీ నంబర్ 9 : 40.23 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం రూ.514.28 కోట్లు. అంటే కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.12.18 కోట్లు. ప్యాకేజీ నంబర్ 10 : 28.60 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం రూ.570.80 కోట్లు. అంటే ఒక్కో కిలో మీటర్ నిర్మాణానికి రూ.19.95 కోట్లు. (మూడు ప్యాకేజీల పరిధిలో 7 కిలోమీటర్ల మేర లింకు రోడ్లతో కలిపి) ప్రతి పనిలోనూ ఇదే తంతు! రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా అంతిమ లక్ష్యం కమీషన్లే. అందువల్లే అదిరిపోయే ధరలను ఖరారు చేస్తోంది. ఇష్టానుసారం పనుల అంచనాలను పెంచేస్తూ.. కావాల్సిన సంస్థలకు ఆ పనులు వచ్చేలా టెండర్ల నిబంధనలను రూపొందిస్తోంది. ఆ తర్వాత ఆ పనులు దక్కించుకున్న సంస్థలు ముందే చేసుకున్న ఒప్పందం మేరకు ‘ముఖ్య’ నేతకు కమీషన్లు అంద జేస్తాయి. దాదాపు ప్రతి పనిలోనూ ఇదే తంతు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు 6,020 రూపాయలను వ్యయం చేసినప్పటికీ ఎక్కడా నాణ్యత లేదని, ఆ భవనాల నుంచి వర్షం నీరు కారు తుండటంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు చేస్తుండటం ప్రత్యక్ష ఉదాహరణ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
గుట్ట-వరంగల్.. 4 లేన్ రోడ్!
రహదారి విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం * రూ.1,905.23 కోట్ల వ్యయంతో ఈపీసీ విధానంలో నిర్మాణం * పూర్తయితే.. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రోడ్డు న్యూఢిల్లీ: యాదగిరిగుట్ట-వరంగల్ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. ఆ మార్గాన్ని 4 లేన్ రోడ్డుగా విస్తరించేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 163వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా యాదగిరిగుట్ట-వరంగల్ మధ్య ఉన్న దాదాపు 99 కి.మీ.ల పొడవైన రహదారిని రూ. 1,905.23 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి పథకం(ఎన్‌హెచ్‌డీపీ) 4వ దశలో భాగంగా దీన్ని చేపట్టనున్నారు. భూ సేకరణ, పునరావాసం, ఇతర నిర్మాణ పూర్వ కార్యక్రమాల ఖర్చుతో కలుపుకుని రూ. రూ. 1,905.23 కోట్లను ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంగా నిర్ధారించారు. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి వరంగల్ మార్గం మొత్తం 4 లేన్ రోడ్‌గా మారుతుంది. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం, వరంగల్‌కు ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు.. ⇒ ఎన్‌హెచ్‌డీపీ నాలుగో దశలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జాతీయ రహదారి 3పై ఉన్న 93.5 కి.మీ.ల పొడవైన ‘గున- యోర’ మార్గాన్ని రూ. 1,081.90 కోట్ల అంచనా వ్యయంతో.. 141.26 కి.మీ.ల పొడవైన ‘బయోర-దేవ’ మార్గాన్ని రూ. 1,733.79 కోట్ల వ్యయంతో నాలుగు రోడ్ల మార్గంగా విస్తరించేందుకు సీసీఈఏ ఆమోదం. దీన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ఓటీ) విధానంలో చేపట్టనున్నారు. ⇒ నాఫ్తా ఆధారిత యూరియా ఉత్పత్తి పరిశ్రమలైన మద్రాస్ ఫెర్టిలైజర్స్(ఎంఎఫ్ఎల్), మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఎంసీఎఫ్ఎల్), సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(స్పిక్)లకు తమ యూరియా ఉత్పత్తిని కొనసాగించేందుకు అనుమతి. దక్షిణాది రాష్ట్రాలకు యూరియా లభ్యత విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం. ఆయా పరిశ్రమలకు పైప్‌లైన్ ద్వారా కానీ, మరే ఇతర మార్గాల ద్వారా కానీ గ్యాస్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ⇒ భారత్ నుంచి భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు.. ఆయా దేశాల నుంచి భారత్‌కు రోడ్డు మార్గంలో అడ్డంకులు లేకుండా ప్రయాణికుల, వస్తువుల రవాణాకు వీలు కల్పించే మోటారు వాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. ఆ మూడు సార్క్ దేశాలతో కుదిరిన ఆ ఒప్పందంపై ఈ నెల 15న భూటాన్‌లో సంతకాలు జరగనున్నాయి. ⇒ పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు పప్పు ధాన్యాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం. పప్పు ధాన్యాలను అక్రమంగా నిలువ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు సూచించింది. దేశీయంగా దిగుబడి తగ్గడంతో గత సంవత్సర కాలంగా పప్పుధాన్యాల ధరలు దాదాపు 64% పెరిగాయి. ⇒ చెరకు రైతుల బకాయిలను పాక్షికంగా తీర్చేందుకు చక్కెర మిల్లులకు రూ. 6 వేల కోట్లను వడ్డీలేని రుణాలుగా అందించేందుకు సీసీఈఏ అంగీకారం. దీనివల్ల ప్రభుత్వం రూ. 600 కోట్ల వడ్డీని కోల్పోనుంది. మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ. 21 వేల కోట్లు ఉన్నాయి.