గుట్ట-వరంగల్.. 4 లేన్ రోడ్!
రహదారి విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
* రూ.1,905.23 కోట్ల వ్యయంతో ఈపీసీ విధానంలో నిర్మాణం
* పూర్తయితే.. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రోడ్డు
న్యూఢిల్లీ: యాదగిరిగుట్ట-వరంగల్ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. ఆ మార్గాన్ని 4 లేన్ రోడ్డుగా విస్తరించేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 163వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా యాదగిరిగుట్ట-వరంగల్ మధ్య ఉన్న దాదాపు 99 కి.మీ.ల పొడవైన రహదారిని రూ. 1,905.23 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి పథకం(ఎన్‌హెచ్‌డీపీ) 4వ దశలో భాగంగా దీన్ని చేపట్టనున్నారు. భూ సేకరణ, పునరావాసం, ఇతర నిర్మాణ పూర్వ కార్యక్రమాల ఖర్చుతో కలుపుకుని రూ. రూ. 1,905.23 కోట్లను ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంగా నిర్ధారించారు. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి వరంగల్ మార్గం మొత్తం 4 లేన్ రోడ్‌గా మారుతుంది. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం, వరంగల్‌కు ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు..
⇒ ఎన్‌హెచ్‌డీపీ నాలుగో దశలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జాతీయ రహదారి 3పై ఉన్న 93.5 కి.మీ.ల పొడవైన ‘గున- యోర’ మార్గాన్ని రూ. 1,081.90 కోట్ల అంచనా వ్యయంతో.. 141.26 కి.మీ.ల పొడవైన ‘బయోర-దేవ’ మార్గాన్ని రూ. 1,733.79 కోట్ల వ్యయంతో నాలుగు రోడ్ల మార్గంగా విస్తరించేందుకు సీసీఈఏ ఆమోదం. దీన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్‌ఓటీ) విధానంలో చేపట్టనున్నారు.
⇒ నాఫ్తా ఆధారిత యూరియా ఉత్పత్తి పరిశ్రమలైన మద్రాస్ ఫెర్టిలైజర్స్(ఎంఎఫ్‌ఎల్), మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఎంసీఎఫ్‌ఎల్), సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(స్పిక్)లకు తమ యూరియా ఉత్పత్తిని కొనసాగించేందుకు అనుమతి. దక్షిణాది రాష్ట్రాలకు యూరియా లభ్యత విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం. ఆయా పరిశ్రమలకు పైప్‌లైన్ ద్వారా కానీ, మరే ఇతర మార్గాల ద్వారా కానీ గ్యాస్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
⇒ భారత్ నుంచి భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు.. ఆయా దేశాల నుంచి భారత్‌కు రోడ్డు మార్గంలో అడ్డంకులు లేకుండా ప్రయాణికుల, వస్తువుల రవాణాకు వీలు కల్పించే మోటారు వాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. ఆ మూడు సార్క్ దేశాలతో కుదిరిన ఆ ఒప్పందంపై ఈ నెల 15న భూటాన్‌లో సంతకాలు జరగనున్నాయి.
⇒ పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు పప్పు ధాన్యాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం. పప్పు ధాన్యాలను అక్రమంగా నిలువ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు సూచించింది. దేశీయంగా దిగుబడి తగ్గడంతో గత సంవత్సర కాలంగా పప్పుధాన్యాల ధరలు దాదాపు 64% పెరిగాయి.
⇒ చెరకు రైతుల బకాయిలను పాక్షికంగా తీర్చేందుకు చక్కెర మిల్లులకు రూ. 6 వేల కోట్లను వడ్డీలేని రుణాలుగా అందించేందుకు సీసీఈఏ అంగీకారం. దీనివల్ల ప్రభుత్వం రూ. 600 కోట్ల వడ్డీని కోల్పోనుంది. మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ. 21 వేల కోట్లు ఉన్నాయి.