సంచలనం కోసమే తనిష్క్లో చోరీ చేశా: కిరణ్
హైదరాబాద్: జనంలో కన్పించాలన్న ఉద్దేశంతోనే తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ అనే యువకుడు తెలిపాడు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్‌తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. ఐదు నిమిషాలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు.
రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపడానికే దొంగతనం చేసినట్టు కిరణ్ తెలిపాడు. దొంగతనానికి, రాజకీయానికి తేడా లేదన్నాడు. తాను ఒక రాత్రి దొంగ అయితే, రాజకీయ నాయకులు ఐదేళ్ల దొంగలని విమర్శించాడు. వ్యవస్థలో మార్పు రావాలని అతడు ఆకాంక్షించారు. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే తనను అవహేళన చేశారని చెప్పాడు. ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఊరిని బాగుచేయాలనుకున్నా అవకాశం ఇవ్వలేదన్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడం, సమాజంలో మంచితనం లేకపోవడం వల్లే దొంతనం చేశానన్నాడు. తన వెనుక ఎవరూ లేరన్నారు.
ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. చనిపోయే హక్కు తనకు లేదని విరమించుకున్నట్టు చెప్పాడు. ఏదోక సంచలనం చేసి జనం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో తనిష్క్లో చోరీ చేసినట్టు చెప్పాడు. జనం, రాజకీయం, సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించాడు. తనకు అవకాశమిస్తే వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. ప్రజలను బాగు చేయగలన్న నమ్మకం తనకుందన్నాడు.
తనిష్క్ లో తానే చోరీ చేశానని కిరణ్ చెబితే పోలీసులు మొదట నమ్మలేదు. తన గదిలో దాచిన దొంగిలించిన సొమ్మును చూపించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు చెబుతున్న మాటల్లో వాస్తమెంత, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.