Equilar list
-
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..
న్యూయార్క్: ఎస్అండ్పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్ ఫెర్నీ సీఈవో జేన్ స్టెవెన్సన్ పేర్కొన్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
ప్రపంచ టాప్-10 వేతన సీఈఓల్లో.. మనోళ్లు ఇద్దరు!
♦ ఈక్విలార్ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్... ♦ టాప్-100లో సత్య నాదెళ్ల న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పదిమంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వందమంది జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్‌లతో పాటు సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. వివరాలు.. ♦ రసాయనాల కంపెనీ ల్యాండెల్‌బాసెల్ ఇండస్ట్రీస్ సీఈఓ భవేశ్ వి. పటేల్ 2.45 కోట్ల డాలర్ల వేతనంతో ఆరవ స్థానంలో ఉన్నారు. ♦ 2.22 కోట్ల డాలర్ల వేతనంతో పెప్సికో ఇంద్రా నూయికి ఎనిమిదవ స్థానం లభించింది. ♦ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26వ స్థానంలో ఉన్నారు. ఆయన వేతనం 1.83 కోట్ల డాలర్లు. ♦ ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన మార్క్ వి. హర్డ్, సఫ్ర ఏ కాట్జ్‌లు 5.32 కోట్ల డాలర్ల వేతనాలతో మొదటి స్థానంలో నిలిచారు. ♦ వాల్ట్ డిస్ని రాబర్ట్ ఏ ఐగర్ 4.35 కోట్ల డాలర్ల వేతనంతో రెండో స్థానంలో ఉండగా, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ ఎం. కోట్ 3.31 కోట్ల డాలర్ల వేతనంతో మూడో స్థానంలో, జనరల్ ఎలక్ట్రిక్ చీఫ్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్ 2.64 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ♦ గత ఏడాది సీఈఓల సగటు వేతనం 1.45 కోట్ల డాలర్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 3% అధికం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు సగటు వేతనం కంటే తక్కువగానే (1.03 కోట్ల డాలర్లు) లభిస్తోంది. వారెన్ బఫెట్ వేతనం 4.7 లక్షల డాలర్లు మాత్రమే. ♦ ఈ టాప్-100లో 8 మంది మహిళలకు చోటు దక్కింది. అత్యధిక వేతనం అందుకుంటున్న మహిళగా ఒరాకిల్ సీఈఓ కాట్జ్ నిలిచింది.