ఏ వయసుకు.. ఆ ప్లాన్
పదవీ విరమణ అనంతర జీవితం సాఫీగా సాగిపోవడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నపుడు ఓ విషయం బాగా గుర్తుంచుకోవాలి... రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఈ ప్లానింగ్ మౌలికంగా ఒకే రకంగా ఉంటుంది కానీ, వయసును బట్టి ప్రాధాన్యతలు మారుతుంటాయి. పాతికేళ్ల వయసులోనే ఇన్వెస్ట్మెంట్లు ప్రారంభించే వారు రిస్కులను తట్టుకునే స్థితిలో ఉంటారు.
పదవీ విరమణ వయసు దగ్గరపడేకొద్దీ రిస్కు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఏ వయసులో రిటైర్ అవుతారు, మీరు నెలకో, ఏడాదికో ఎంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలరు, ఆ తర్వాత నుంచి మీకు ఎంత ఆదాయం అవసరం, మీ ప్రస్తుత వయసు ఎంత అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రిటైర్మెంట్ ప్లానింగ్ సులువుగా ఉంటుంది. ఏజ్ గ్రూప్‌ల వారీగా రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఇపుడు పరిశీలిద్దాం.
20లలో బెస్టు...
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో యువతీ యువకులు రిటైర్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోరు. తామింకా చిన్నవాళ్లమనీ, పదవీ విరమణ గురించి తర్వాత ఆలోచించవచ్చనీ అనుకుంటారు. వాస్తవానికి 20లలో పెట్టుబడులు ప్రారంభించే వారికి ఎన్నో అదనపు ప్రయోజనాలున్నాయి. రిటైర్ కావడానికి 30-35 ఏళ్లు గడువుంటుంది కాబట్టి నెలనెలా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినా అప్పటికి భారీ మొత్తం చేతికి అందుతుంది. పెట్టుబడుల పరంగా అత్యధిక రిస్కును తట్టుకోగల వెసులుబాటు వీరికి ఉంటుంది.
30లలో అయినా మంచిదే...
ముప్పయ్ ఏళ్లు పైబడిన వారు తమ కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి సీరియస్‌గా ఆలోచించడం ప్రారంభిస్తారు. రిటైర్మెంట్ ప్లానింగ్‌కు ఇది కూడా అత్యుత్తమ వయసే. పదవీ విరమణకు ఇంకా చాలా ఏళ్లు ఉంటుంది కాబట్టి వీరి పెట్టుబడులపై భారీ ఆదాయం వస్తుంది.
40లలో సీరియస్‌గా...
భారత్ వంటి దేశాల్లో ప్రజలు 40 ఏళ్ల వయసు తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తారు. రిటైర్మెంట్ ప్లానింగ్‌కు ఇదే సరైన వయస్సనీ, ఇది మరీ ముందు, మరీ ఆలస్యం కాని వయస్సనీ చాలామంది భావిస్తుంటారు. ఈ వయసు వారు ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉండకపోతే, ఆ దిశలో పయనించడానికి ఇది సరైన వయస్సేనని నిపుణులూ విశ్వసిస్తారు.
నలబై ఏళ్లకు పెట్టుబడులు మొదలుపెడితే పదవీ విరమణకు మరో 20 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది కాబట్టి భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ఈ వయసు వారి పిల్లలు పెద్ద తరగతుల్లోకి వచ్చి ఉంటారు కాబట్టి ఖర్చులెక్కువ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ వ్యయం కూడా పెరుగుతుంది. కనుక, ఖర్చులను సాధ్యమైనంత తగ్గించుకుని పెన్షన్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
50లలో...
యాబై ఏళ్ల వయసు వచ్చాక రిటైర్మెంట్ గురించి ఆలోచించే వారు కాస్తంత కలవరానికి గురవుతారు. నిజానికి, ఆందోళన చెందాల్సిందేమీ లేదు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు చేయడానికి ఇంకా తగినంత సమయం మిగిలే ఉంటుంది. ఈ వయసు వచ్చే సరికి పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఓ కొలిక్కి వచ్చి ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడులు చేసి ఉంటే... వాటిని డెట్ ఇన్స్ట్రుమెంట్లలోకి మార్చండి. మార్కెట్ ఒడిదొడుకులను ఈ వయసులో భరించడం అంత ఈజీ కాదు.
60లలో..
ఈ వయసు వారు పదవీ విరమణ పొంది ఉండవచ్చు. లేదా, రిటైర్మెంట్కు దగ్గర పడి ఉండవచ్చు. రిటైర్మెంట్ ప్లాన్ గురించి గతంలో ఆలోచించి ఉండకపోయినా ఫర్వాలేదు. వెంటనే యాన్యుయిటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి నిర్ణీత కాలం లేదా జీవితాంతం ఆదాయం వస్తూనే ఉంటుంది. మీ వివరాలను ఫైనాన్షియల్ కన్సల్టెంట్లకు చెబితే, మీకు తగిన ప్లాన్‌ను వారు సూచిస్తారు. అవకాశం ఉంటే, మీ రిటైర్మెంట్ను వాయిదా వేసుకోండి. అంటే.. మీకు సుదీర్ఘానుభవం కలిగిన రంగంలో కన్సల్టెంట్ తరహా సేవలందిస్తానని మీ కంపెనీ యజమానిని కోరండి.
70లలో..
దాచుకున్న డబ్బు చాలా వేగంగా ఖర్చయిపోతూ ఉంటుంది. రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఇప్పటికైనా ఆలోచించకపోతే మీ చేతిలోని డబ్బును ద్రవ్యోల్బణం కరిగించేస్తూ ఉంటుంది. పొదుపు చేసిన సొమ్ములో ఎక్కువ మొత్తాన్ని యాన్యుయిటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ వయసు వారికి ఉత్తమం.