త్వరలో బజాజ్ మరో క్రూయిజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. మోటార్ సైకిల్ బ్రాండ్‌గానే కొనసాగాలని నిశ్చయించింది. స్కూటర్ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టే ఆలోచనేది సంస్థకు లేదని బజాజ్ మోటార్ సైకిల్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో బజాజ్ నూతన డిస్కవర్ 150 బైక్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బైక్‌ల విపణిలో వ్యాపార అవకాశాలు అపారమని, భారత్‌లోనూ ఇంకా విస్తరించాల్సి ఉందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయనింకా ఏమన్నారంటే..
మరో క్రూయిజర్..: క్రూయిజర్ విభాగంలో ప్రస్తుతం అవెంజర్ 220ని విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా నెలకు 3,500 బైక్‌లు అమ్ముడవుతున్నాయి. క్రూయిజర్ విభాగంలో బజాజ్‌దే అగ్రస్థానం. కొత్త ఫీచర్లు, మంచి డిజైన్‌తో మరో మోడల్ రానుంది. అలాగే స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ పల్సర్‌లో మరో రెండు మోడళ్లను కొద్ది రోజుల్లో తీసుకొస్తున్నాం. నెలకు 56 వేల బైక్‌లు అమ్ముతున్నాం. స్పోర్ట్స్ బైకుల్లో 50% వాటా పల్సర్దే. ఇక డిస్కవర్ బ్రాండ్‌లో నెలకు 71 వేల బైక్‌లు విక్రయిస్తున్నాం. ప్రతి 3 నెలలకు ఒక కొత్త బైక్‌ను ఆవిష్కరిస్తున్నాం.
తగ్గుతున్న 125 సీసీ..
భారత్‌లో 2007-08 ప్రాంతంలో నెలకు 5 లక్షల మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యేవి. ఇందులో 100 సీసీ బైక్‌లు 58 శాతం, 125 సీసీ 19 శాతం, స్పోర్ట్స్ బైక్‌లు 12 శాతం కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం 100 సీసీ, స్పోర్ట్స్ బైక్ విభాగాల వాటా చెరి 2 శాతం పెరిగాయి. 125 సీసీ విభాగం మాత్రం 2 శాతం తగ్గింది. వాహనదారుల అంచనాలను చేరుకోకపోవడమే 125 సీసీ బైక్‌ల అమ్మకాలు తగ్గడానికి కారణం. స్టైల్, పనితీరు, సౌకర్యం ఇవే కస్టమర్ కోరుకునేది. వీటిని ప్రాతిపదికగా చేసుకునే మోడళ్లను ప్రవేశపెడుతున్నాం. కొత్త డిస్కవర్ 150 డిజైన్‌కు రెండేళ్లు పట్టింది. ఈ బైక్ మైలేజీ 72 కిలోమీటర్లు. 100 సీసీ బైక్‌లు మాత్రమే మైలేజీ ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం లేదు.
ప్రపంచ మార్కెట్లో 10 శాతం..
నైజీరియా, ఈజిప్ట్, కొలంబియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు బైక్‌లను ఎగుమతి చేస్తున్నాం. ఈ దేశాల్లో బజాజ్‌దే అగ్రస్థానం. నెలకు దాదాపు 4 లక్షల యూనిట్లు విక్రయిస్తున్న బజాజ్‌కు ప్రపంచ మోటార్ సైకిల్ మార్కెట్లో 10 శాతం వాటా ఉంది. మరిన్ని దేశాలకు విస్తరించి వాటా పెంచుకుంటాం. భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 20 శాతం మార్కెట్ వాటా ఉంది. కంపెనీ ఉత్పత్తిలో సగం ఎగుమతులు ఉంటున్నాయి. ప్రస్తుతం దేశీయ బైక్‌ల మార్కెట్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2014-15లో రెండంకెల వృద్ధి ఖాయంగా కనపడుతోంది. పరిశ్రమ కంటే బజాజ్ వృద్ధి ఎక్కువగా ఉండనుంది.