ESI director devika rani
-
ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కాంలో దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ముఖ్య పాత్రధారులుగా ఈడీ భావిస్తున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించి ఆదివారం సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమోద్‌రెడ్డి డొల్ల కంపెనీల వెనుక నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తున్న ఈడీ.. నిందితులు పెద్ద ఎత్తున నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానిస్తోంది. కూడబెట్టిన ఆస్తులను అటాచ్ చేసేందుకు కూడా ఈడీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నిందితుల ఇళ్లపై శనివారం హైదరాబాద్‌లో ఈడీ దాడులు జరపడం, వాటిల్లో కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి నిందితుడిగా ఉండటంతో కోదాడలో సంచలనం రేపింది. ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కాంలో కూడా ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉండటంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసినప్పుడు అతడు అజ్ఞాతంలోకి వెళ్లి 2 నెలల క్రితం న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ప్రమోద్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరపడం, భారీగా నగదు పట్టుబడటంతో మళ్లీ ఆయన పేరు చర్చనీయాంశమైంది. ( చదవండి: రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు ) -
ఈఎస్ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంలో దేవికారాణి అక్రమాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా మరో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అమిని కంపెనీ ప్రతినిధులతో కలిసి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. అమిని కంపెనీ చైర్మన్ శ్రీహరిబాబుకు సంబంధించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 99 కోట్ల రూపాయలతో షేర్‌తో పాటు, 30 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ఏసీబీ గుర్తించింది. శ్రీహరి బాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఇప్పటికే దేవికా రాణిపై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. -
దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్‌లో నిందితురాలు దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఆమె వందకోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆమెకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త గురుమూర్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్) సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఆస్తులు వివరాలు ఇవే.. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్‌లో దేవికారాణికి చెందిన రూ. 34లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. వేర్వేరుగా 23 బ్యాంకుల్లో రూ. కోటీ 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపారు. దేవికారాణి ఇంట్లో రూ. 25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఇంట్లో రూ. 8.40 లక్షల నగదు, రూ. 7లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 20 లక్షల ఇన్నోవా కారు, రూ. 60 వేల మోటర్ బైక్‌ను సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తించామని అన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్లపైగా ఉంటుందన్నారు. పీఎంజే జ్యువెల్లర్స్ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఈఎస్ఐ స్కామ్ : నిందితులకు రెండురోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ నిధుల కుంభకోణం కేసులో డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితులను రెండ్రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఏసీబీ ఈ నెల 9, 10వ తేదీలలో తమ కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లైఫ్‌కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్‌రెడ్డిని ఏసీబీ శనివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 9. కాగా ఏసీబీ మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
వైద్య బిల్లుల చెల్లింపు చకచకా!
♦ ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులకు వెంటనే రీయింబర్స్మెంట్ ♦ నెలల తరబడి ఎదురుచూపులకు చెక్ ♦ రీయింబర్స్‌మెంట్‌కు ప్రత్యేక బడ్జెట్ ♦ కార్మికశాఖకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కార్డుదారులకు శుభవార్త! కార్మికులు అత్యవసర సమయంలో ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందితే వాటి బిల్లుల చెల్లింపు విషయంలో నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతో కార్మికులు వైద్యం కోసం చేసిన అప్పులు గుదిబండగా మారేవి. ఇకపై వీటికి చెక్ పెట్టాలని ఈఎస్ఐ డెరైక్టర్ దేవికా రాణి కొత్త ప్రతిపాదన చేశారు. వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దానికి ఒక అధిపతి (హెడ్ఆఫ్ ది డిపార్ట్మెంట్)ని నియమించాలని నిర్ణయించారు. తద్వారా కార్మికుల వైద్య బిల్లులకు త్వరతగతిన చెల్లింపులు జరగనున్నాయి. ఈమేరకు ఈఎస్ఐ డెరైక్టరేట్ కార్యాలయం నుంచి కార్మికశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. అక్కడ గ్రీన్‌సిగ్నల్ లభిస్తే వెనువెంటనే కార్యరూపం దాల్చనుంది. దీనిద్వారా 10 లక్షల మంది కార్మికులకు లబ్ధిచేకూరనుంది. పెండింగ్‌లో 7 వేల దరఖాస్తులు ఈఎస్ఐ కార్డుదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ఆ బిల్లులకు తొలుత సంబంధిత డిస్పెన్సరీలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఈఎస్ఐ డెరైక్టరేట్ కార్యాలయానికి పంపాలి. అక్కడ మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగం పరిశీలిస్తుంది. అనంతరం వైద్యుల కమిటీ ఆమోదం పొందిన తర్వాత కూడా అకౌంట్స్ విభాగం నుంచి డబ్బులు విడుదల కావడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. ప్రస్తుతం రీయింబర్స్మెంట్ విభాగం వద్ద 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ప్రతీ నెల దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నా... ఏడు వందలకు మించి పరిష్కారం కావడంలేదు. దీంతో కార్మికుల వైద్యబిల్లులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. గత ఫిబ్రవరి నుంచి వచ్చిన బిల్లుల వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కేవలం నెల రోజుల్లో రీయింబర్స్మెంట్ పొందవచ్చు.