ఈఎస్ఐసీ వైద్య కళాశాలను తెలంగాణకు ఇస్తాం: దత్తాత్రేయ
హైదరాబాద్: హైదరాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న ఈఎస్ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్) వైద్యకళాశాల, ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన సనత్నగర్లో రూ.367 కోట్లతో నిర్మిస్తున్న ఈఎస్ఐసీ వైద్యకళాశాల భవనం, ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 300 సీట్ల సామర్ధ్యం కలిగిన వైద్యకళాశాలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కళాశాలలో మరో రూ.100 కోట్లతో నిర్మాణ పనులు చేయాల్సి ఉందని తెలిపారు.
నాచారంలో డెంటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అంగన్వాడీ, భవన నిర్మాణరంగ, బీడీ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులకు ’ఆమ్ ఆద్మీ బీమా యోజన’ పథకం కింద గుర్తింపుకార్డులిచ్చి రూ.30 వేల వరకు వైద్యం చేయించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఎస్ఐ అధికారులు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అధికారులు ఎస్.ఆర్.చౌహన్,ఆర్.కె.కఠారియా,బాల్రాజ్ బండారి, నాగ మల్లేశ్వరరావు,రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.