పరిశోధనలతోనే దేశ ప్రగతి
ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో టీసీఎస్ ఉపాధ్యక్షుడు ఎస్. రామదొరై భవిష్యత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీదే : కేటీఆర్
హైదరాబాద్ : నిత్య విద్యార్థిగా ఉంటేనే కెరీర్లో రాణించగలరని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఉపాధ్యక్షుడు ఎస్.రామదొరై అన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా యువత కెరీర్ను నిర్మించుకోవాలన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ 13వ స్నాతకోత్సవ సభకు హాజరైన రామదొరై మాట్లాడుతూ భారత్ సైన్స్పరంగా అభివృద్ధి చెందుతున్నా పరిశోధనల్లో చైనా కంటే వెనుకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ‘రీసెర్స్ పవర్ హౌస్’గా ఆవిర్భవించనుందన్నారు. ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ, ఆటోమోటివ్ రంగాలు 2015 నాటికి మరింత వృద్ధి చెందుతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు.
ఐటీ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భవిష్యత్లో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు దీటుగా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజరెడ్డి, డెరైక్టర్ పి.జె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పూర్తిచేసిన సుమారు 375 మంది విద్యార్థినీ, విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. బెస్ట్ ఆల్ రౌండర్-2014గా ఎంపికైన బీటెక్(సీఎస్ఈ) విద్యార్థి చెట్లూర్ మాధవన్ మలోలన్ కు పసిడి పతకం బహూకరించారు.