ప్రియుడితో కలసి వివాహిత మృతి
నోయిడాలో అనుమానాస్పద ఘటన..
మహిళ చిత్తూరు జిల్లా వాసి
న్యూఢిల్లీ: ప్రియుడితో కలసి ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నోయిడా సెక్టార్ 49లోని సర్ఫాబాద్ గ్రామంలోని ఓ ఇంట్లో ఇరువురి మృతదేహాలను మంగళవారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. అవి ఒడిశాకు చెందిన నవీన్‌కుమార్(32), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఎట్టెడ గ్రామానికి చెందిన దాక్షాయణి(30)విగా పోలీసులు గుర్తించారు. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు.. దాక్షాయణి, రేవన్న భార్యాభర్తలు. వీరికి మహేశ్ కుమార్ (5), మౌనిక (3) అనే ఇద్దరు పిల్లలున్నారు.
బెంగళూరులో రేవన్న ఇంటిపక్కనే నవీన్‌కుమార్ అద్దెకు ఉండేవాడు. దాక్షాయణితో నవీన్‌కు ఉన్న పరిచయం ప్రేమగా మారింది. బెంగళూరు నుంచి మకాం మార్చిన నవీన్ నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. సర్ఫాబాద్ గ్రామంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. కాగా రెండు నెలల కిందట పుట్టింటి(చిత్తూరు)కి వెళ్తున్నట్టు భర్త రేవన్నకు చెప్పిన దాక్షాయణి తన పిల్లలను తీసుకుని నోయిడాకు వచ్చి నవీన్‌తో ఉంటోంది. ఆదివారం రాత్రి స్నానాల గదిలో వారిద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి.
తల్లి కనిపించకపోవడంతో సోమవారం పిల్లలు స్కూల్‌కు వెళ్లలేదు. పిల్లలు గైర్హాజరవడంతో స్కూలు టీచరు వారి కోసం ఓ విద్యార్థిని నవీన్ ఇంటికి పంపారు. తల్లి బాత్రూంకు వెళ్లి తిరిగిరాలేదని దాక్షాయణి కొడుకు మహేశ్ చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానాల గది తలుపు పగులగొట్టగా ఇరువురి మృతదేహాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దాక్షాయణిని హత్యచేసి ఆ తర్వాత నవీన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.