డొంక కదులుతోంది !
- సోలార్‌ప్లాంట్ భూసేకరణలో అక్రమాలపై విచారణ
- వీఆర్ఓ, కంప్యూటర్ ఆపరేటర్‌కు నోటీసులు
- సెలవుపై వెళ్లిన తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్
తాడిపత్రి : తలారిచెరువు సోలార్ ప్లాంట్ భూఅక్రమాల డొంక కదులుతోంది. తప్పుడు రికార్డులు సృష్టించి పరిహారం పొందుతున్న వైనంపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘గోల్మాల్’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లపై అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) మలోలా ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపాలని తాడిపత్రి తహసీల్దార్ యల్లమ్మను ఆదేశించారు.
కొన్ని సర్వే నంబర్లకు సంబంధించి భూరికార్డుల్లో తనకు తెలియకుండా వివరాలు నమోదు చేయడంపై తలారిచెరువు గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) గంగన్న, రెవెన్యూ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రమణకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అలాగే పూర్తి స్థాయి విచారణ చేయకుండా 17 రిజిస్ట్రేషన్లను హడావుడిగా చేపట్టడం, తర్వాత వాటిని తాత్కాలికంగా నిలిపివేయడంపై తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్‌ను జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వివరణ కోరారు. దీంతో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ నల్లప్పకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
భూసేకరణ ప్రకటనకు ముందే అక్రమాలు
తాడిపత్రి మండలం తలారిచెరువు సమీపంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో సంస్థ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్న విషయాన్ని ముందే పసిగట్టిన అక్రమార్కులు.. భూసేకరణ ప్రకటన రాకముందే గోల్మాల్ వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ప్లాంట్‌కు సేకరిస్తున్న వాటిలో 106 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.
వీటి రికార్డులను తారుమారు చేశారు. ఇందుకు రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించారు. వెబ్‌ల్యాండ్‌లో పేర్లను మార్చడంతో పాటు ఏకంగా ఈసీలను కూడా సృష్టించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసలైన రైతులు జెన్కో, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం భూ యజమానుల రికార్డులను పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, భూ లావాదేవీలపై సమగ్ర విచారణ చేస్తున్నారు. జెన్కో అధికారులు కూడా వివాదాలు ఉన్న భూములను సేకరించబోమని చెబుతున్నారు.