‘రియో’ టికెట్ దక్కింది
♦ ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత
♦ 36 ఏళ్ల తర్వాత ఈ ఘనత
న్యూఢిల్లీ : మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత మహిళల హాకీ జట్టు అధికారికంగా రియో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. లండన్‌లో జరుగుతున్న యూరో హాకీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లు ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. గత నెలలో బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్ ఐదో స్థానంలో నిలువడంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన పదో జట్టుగా నిలిచిందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శనివారం అధికారికంగా ప్రకటించింది.
భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి రోజునే భారత మహిళల హాకీ జట్టుకు ఒలింపిక్స్ బెర్త్ దక్కడం విశేషం. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఏకైకసారి బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.