ఇంజనీర్ టు సీఈవో
ప్రపంచంలోని వివిధ సంస్థల్లో ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈవో)గా పనిచేస్తున్న వారిలో అత్యధికులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయమిది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని 50 అత్యుత్తమ కంపెనీల్లో సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న వారిలో చాలామంది ఇంజనీరింగ్ విభాగం నుంచి వచ్చినవారే. ఇంజనీరింగ్‌తోపాటు పేరున్న విద్యాసంస్థ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకోవడం వీరికి అదనంగా కలిసి వస్తున్న అంశం. ఇతర విభాగాల వారితో పోలిస్తే ఇంజనీరింగ్+ఎంబీఏ గ్రాడ్యుయేట్లే సీఈవోలుగా దూసుకుపోతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను దీనికి ప్రముఖ ఉదాహరణగా పేర్కొనవచ్చు. జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బెర్రా, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు ఇవెన్ చ్వాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదవుతుంది. ఫార్చ్యూన్-500 సీఈవోల జాబితాలో ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్లు అందరి కంటే ముందంజలో ఉన్నారు.
ప్రధాన కారణాలివే..
చాలామంది ఇంజనీర్లు ప్రముఖ కంపెనీల్లో సీఈవో స్థాయికి ఎదగడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. సహజంగా ఆ విభాగానికి చెందిన అభ్యర్థులకు ఉన్న లక్షణాలే వారిని ఆ స్థాయిలో నిలపడానికి తోడ్పడు తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సమస్యల సాధన ద్వారా ఆలోచనా శక్తిని మెరుగుపరచుకోవడం; వివరణా త్మకంగా, విశ్లేషణాత్మకంగా అభ్యసించడం; వైవిధ్యంగా ఆలోచించడం; కష్టపడి పనిచేయడం; అవసరాలు, అవకాశాలకు అనుగుణంగా కెరీర్లో మార్పులు చేసుకోవడం లాంటి లక్షణాలు వారిలో ఉంటున్నాయి. చరిత్ర ఆధారంగా పరిశీలించినా మనకు ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. థామస్ అల్వా ఎడిసన్, జాన్ స్టీవెన్స్, హెన్రీ ఫోర్డ్, హెర్బర్ట్ హోవర్ లాంటి ప్రముఖు లు వారి పరిశోధనల్లో భాగంగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానం, సవాళ్లను స్వీకరించే తత్వం, సాంకేతిక నైపుణ్యాలు, నియమనిబద్ధత, నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ స్కిల్స్, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), భావవ్యక్తీ కరణ నైపుణ్యాలతో ఇంజనీరింగ్ అభ్యర్థులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. వీటన్నింటితో పాటు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఎలాంటి కష్టన ష్టాలను ఎదుర్కోవడానికైనా సాహసించడం వల్లే ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నట్లు వెల్లడైంది. డబ్బే సర్వస్వం కాదనేది వాస్తవమైనా.. ఉద్యోగులు తమ స్థానాలను మెరుగుపరచుకోవడానికి అది ఆక్సిజన్‌లా పనిచేస్తోంది.
కెరీర్.. వైవిధ్యభరితం
ఎక్కువ కాలం ఒకే రకమైన విధులను నిర్వహించడం విసుగు తెప్పించడంతో వైవిధ్యభరితమైన కెరీర్ వైపుగా దృష్టి సారించడం వల్ల సీఈవో లాంటి ఉన్నత పదవులకు చేరుకోగలుగుతున్నామని మరికొందరు పేర్కొంటున్నా రు. వాస్తవానికి ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నత పదవులకు సంబంధించి అంతగా ఆలోచించరని, ఇచ్చిన పనిని సమర్థంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటం తట అవే వస్తాయని ఇంకొందరి అభిప్రాయం. ఇంజనీర్ల తర్వాత ఇలాంటి ఉన్నత అవకాశాలను సొంతం చేసుకుం టున్నవారు మెడికల్ అభ్యర్థులే. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ లాంటి ఇతర విభాగాలకు చెందిన వారితో పోలిస్తే ఇంజనీర్లు, మెడికోలు ఎక్కువగా కష్టపడాల్సి రావడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు.
అర్హతలు.. అదృష్టం
సాధారణంగా మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నా, టెక్నికల్ మెరిట్స్ ఉన్న ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. ఒక సీఈవో నుంచి మరో సీఈవోకు సాంకేతిక అంశంపై వెచ్చించే సమయంలో చాలా తారతమ్యం ఉంటున్నట్లు గుర్తించారు. సీఈవో పదవికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ అనేక కంపెనీల్లో చాలామంది అభ్యర్థులు సాధారణ విధులనే నిర్వహిస్తూ ఉండటం సర్వేలో తేలిన మరో ఆసక్తికర విషయం. దీనికి వివిధ కారణాలున్నాయి. కెరీర్ గ్రాఫ్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి అర్హతలతోపాటు అదృష్టమూ తోడవ్వాలని ఇలాంటి ఉదంతాల ద్వారా గమనించవచ్చు.
నైపుణ్యాలు పెంచుకోవాలి!
‘‘ఇంజనీరింగ్ విద్యార్థుల్లో తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పుష్కలంగా ఉంటాయి. చాలా కంపెనీల సీఈవోలుగా రాణిస్తున్న వారు ఇంజనీర్లే కావడం విశేషం. కానీ ఇంజనీరింగ్ చదివిన వారు మాత్రమే సీఈవోలుగా రాణిస్తారని చెప్పలేం. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా నిరంతర శ్రమ, వ్యక్తిగత సామర్థ్యాలుంటే కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు అధిక అవకాశాలుంటాయని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను నేర్చుకున్న అంశాలు, సమస్యా సాధన నైపుణ్యాలు నా కెరీర్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి విషయాన్ని లాజికల్‌గా ఆలోచిస్తాను. అనాలిసిస్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను. సంస్థ అభివృద్ధిలో సారథిదే ప్రధాన పాత్ర. కంపెనీని నడిపించే సీఈవోల్లో ప్రధానంగా మూడు అంశాలు సహజంగా కనిపిస్తాయి... విజన్, గోల్, మిషన్. సంస్థ అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై సీఈవోలకు స్పష్టమైన విజన్ ఉంటుంది. దాన్ని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. తర్వాత దాని సాకారానికి పటిష్టమైన మిషన్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ నైపుణ్యాలను విద్యార్థి దశలోనే సొంతం చేసుకుంటే కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు’’
- బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్)