కిస్మస్ నాడు కాటు వేద్దామనుకున్నాడు
శాన్ ఫ్రాన్సిస్కో : ఐసిస్‌తో చేతులు కలిపి క్రిస్మస్ పర్వదినం నాడు మారణహోమం సృష్టిద్దామనకున్న వ్యక్తిని ఎఫ్‌బీఐ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఎవరిట్ జేమ్సన్ గతంలో అమెరికన్ మెరెన్స్లో పని చేసినట్లు గుర్తించారు. ఐసిస్ నాయకత్వంతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా నటించిన ఓ అమెరికన్ ఇంటిలిజెన్స్ ఏజెంట్.. ఎవరిట్ను ఎఫ్‌బీఐకు పట్టించడంలో కీలకపాత్ర పోషించారు.
క్రిస్మస్ పండుగ రోజున శాన్ ఫ్రాన్సిస్కోలో అతిరద్దీగా ఉండే పియర్ 39లో దాడికి పాల్పడాలని నిందితుడు భావించినట్లు ఎఫ్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దాడి అనంతరం చనిపోవాలని కూడా ఎవరిట్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. గతంలో అమెరికాలో జరిగిన ఉగ్రదాడులను సమర్థిస్తూ నిందితుడు సోషల్‌మీడియాలో పలు పోస్టులు చేసినట్లు గుర్తించామని చెప్పింది.
ప్రస్తుతం ట్రక్కును నడుపుతూ జీవనం సాగిస్తున్న ఎవరిట్.. ట్రక్కుతో దాడికి పాల్పడతానని ఐసిస్‌తో చర్చించినట్లు వివరించింది. ఎవరిట్ ఇంట్లో చేసిన రైడింగ్‌లో సూసైడ్ నోట్, బాణసంచా, రెండు తుపాకులు, ఒక హ్యాండ్ గన్ లభ్యమైనట్లు చెప్పింది. రెండేళ్ల క్రితం జేమ్సన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, అప్పటి నుంచి ఉగ్రదాడికి పాల్పడేందుకు ఐసిస్ సాయం తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపింది.