నూటొక్క కష్టాలు
- ఏ బ్యాంకుకెళ్లినా ‘నో క్యాష్’
-దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న ఏటీఎంలు
-ఒకటీ అరా పనిచేస్తున్నా..గంటలోపే నగదు ఖాళీ
- ‘ఒకటో తారీఖు’ వచ్చేయడంతో జనం కష్టాలు రెట్టింపు!
-పాల బిల్లు మొదలు.. ప్రతిదానికీ అవస్థే
అనంతపురం అగ్రికల్చర్ : కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. పైగా మరింత ఎక్కువయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. పెద్దనోట్లు రద్దు చేసి 22 రోజులు పూర్తయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ‘ఒకటో తారీఖు’ కూడా వచ్చేయడంతో పాల బిల్లు మొదలు..ప్రతిదానికీ అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. మొదటి వారమంతా ఉద్యోగుల జీతాలు, ప్రజల కమిట్మెంట్ల హడావుడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా వస్తే తమ పరిస్థితి ఏంటని బ్యాంకర్లు భయపడుతున్నారు. బుధవారం కూడా జిల్లాలో చాలా బ్యాంకుల గేట్లు వద్ద 'నోక్యాష్' బోర్డులు దర్శనమిచ్చాయి. అనంతపురం నగరం, ప్రధాన పట్టణాల్లోనే పరిస్థితి ఇబ్బందికరంగా కన్పించింది. ఇక మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖల్లో దారుణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వారం రోజులుగా తిరుగుతున్నా డబ్బు ఇవ్వలేదన్న ఆక్రోశంతో కూడేరులో ఎస్బీఐ ఖాతాదారులు రాస్తారోకో చేపట్టారు.
ఎస్బీఐ, సిండికేట్, ఆంధ్రా, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్ లాంటి ప్రధాన బ్యాంకుల్లోనే అరకొరగా నగదు పంపిణీ చేశారు. అందులోనూ కొన్ని శాఖల్లో నోక్యాష్ బోర్డులు పెట్టారు. ఇక చిన్నాచితక బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. అనంతపురంలోని ఎస్బీఐ ప్రధానశాఖలో బుధవారం రద్దీ ఎక్కువగా కనిపించింది. గురువారం ఉదయానికి రూ.20 కోట్ల వరకు నగదు సరఫరా కానుండడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు రెండు, మూడు రోజుల పాటు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. ఇబ్బందులను అధిగమించడానికి స్వైప్ మిషన్లు, ఎస్బీఐ 'బడ్డీ' యాప్ లాంటి నగదు రహిత లావాదేవీలపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఎనీ టైం మూత
ఏటీఎంల పరిస్థితి ఏ మాత్రమూ మెరుగుపడలేదు. జిల్లా అంతటా 100 లోపు ఏటీఎంలు మాత్రమే పాక్షికంగా పనిచేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. అందులో కూడా రూ.2 వేల నోట్లు పెట్టడం, తెరిచిన రెండు గంటల్లోపే మూతబడటంతో ప్రజలకు నిరాశ తప్పలేదు. రూ.500 నోట్లు పరిమితంగా వచ్చాయి. దీంతో నాలుగైదు బ్యాంకుల్లో మినహా ఇంకా పంపిణీ చేయలేదు. గురువారం నుంచి మొదలుపెట్టనున్నట్లు పలువురు బ్యాంకర్లు తెలిపారు.
రూ.20, రూ.50, రూ.100 నోట్ల కొరత ఎక్కువగా ఉండటంతో చిల్లర సమస్య తగ్గడం లేదు. గత రెండు రోజుల్లోనే రూ.110 కోట్లు అన్ని బ్యాంకులకు సరఫరా చేసినా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. బుధవారం ఏపీజీబీ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంతవరకు డబ్బు సర్దుబాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డి చెప్పారు. ఆంధ్రాబ్యాంకు పరిధిలో నగదు కొరత కారణంగా అవస్థలు పడ్డామని బ్యాంకు సీనియర్ మేనేజర్ అమ్మయ్య తెలిపారు.