ఫోన్లో ఓ మహిళతో రాజయ్య సరసం
ఆమె : హలో సార్ నేను..
అతను: నాకు తెలుసురా.. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటవో నాకు తెలుసురా. నువ్వు ఎంత కొంటె పురుగువంటే..! బాగా కొంటె పనులు చేస్తవు.. కొంటెతనం అంటే..! చిలిపి చేష్టలు అన్నట్టు.. చిలిపి..చిలిపి పనులు అన్నట్టు..
..అంటూ సంభాషణ సాగుతుంటే మహిళ పగలబడి నవ్వుతుండడంతో మొదలైన మాటలు.. ‘నువ్వే నా మొగుడివి’ అనే మాటలతో ముగుస్తుంది. మధ్యలో రాయలేని పదజాలంతో సంభాషణ ఉంటుంది. మొత్తం 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంభాషణలో వినిపిస్తున్న మహిళ గొంతు టీఆర్ఎస్ పార్టీలో పదవి ఆశిస్తున్న ఆమెది కాగా.. పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యదే అని నెటిజన్లు కరాఖండీగా చెబుతున్నారు. పార్టీలో పదవి కోసం ఓ మహిళ.. నేతల చుట్టూ తిరిగే క్రమంలో వారి మధ్య సన్నిహిత సంబం ధానికి దారితీసినట్లు.. ఇది 5 నుంచి 8 నెలల క్రితం రికార్డు చేసిన సంభాషణగా తెలుస్తోంది.
తొలి నుంచి అసమ్మతే..
రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించిన నాటి నుంచీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రాజారపు ప్రతాప్‌తో మొదలైన అసమ్మతి.. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజయ్యను రాజకీయంగా అణగదొక్కాలనే పక్కా పథకం ప్రకారమే ఆడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలోకి వదిలారని రాజయ్య వర్గం అంటోంది. నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరిని కలిసేందుకు మంగళవారం ఉదయం రాజయ్య తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్పింగ్‌ను చూసి మార్గమధ్యలోనే ఆయన వెనుదిరిగినట్లు సమాచారం.
దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ?
మాటల మధ్యలో ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్.. ఏవ్వా ’ అని మహిళ నవ్వుతూ అడుతుండగా.. రాజయ్య గొంతును పోలిన స్వరం నుంచి ‘నీకు పోస్టు దయాకర్ ఇస్తడు.. వెంకటేశ్వర్లేమో రికమండ్ చేస్తడు.. దయాకరేమో ఇస్తడు ’ అనే మాటలు వినిస్తున్నాయి. సదరు మహిళకు వారితో కూడా వివాహేతర సంబంధం అంటగడుతూ నీకు ముగ్గురు హీరోలు అని మాట్లాడుతుండగా.. మహిళ కల్పించుకుని ‘నువ్వే నా హీరో’ అంటూ.. దయాకర్‌కు మరో మహిళతో సంబంధం ఉందని దయాకరే తనకు చెప్పినట్లు మహిళ చెప్పింది.
ఈ నేపథ్యంలో దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాళ్లు కూడా రాజకీయ నాయకులేనా? లేక వ్యాపారవేత్తలా? పోస్టింగ్ పేరుతో మహిళలను ఎంత కాలం నుంచి తిప్పుకుంటున్నారు? అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాగా, రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఒక ఫేక్ ఆడియోను సృష్టించారని రాజయ్య వివరణ ఇచ్చారు. తన గొంతును మిమిక్రీ చేశారని చెప్పారు. ఇలాంటి యత్నాలను చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు.