Excise Enforcement Police
-
విస్తృత తనిఖీలు.. 150 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వేట దూకుడుగా సాగుతోంది. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లు, ఎక్సైజ్ ఠాణా పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి. భారీస్థాయిలో కేసులు నమోదు చేస్తున్నాయి. గంజాయి సాగు చేస్తున్న వారితోపాటు సరఫరా చేస్తున్న వారినీ అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెడుతున్నాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమీక్ష తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు క్వింటాళ్లకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యేక బృందాల సోదాలు ప్రతీ జిల్లా సరిహద్దుల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ నిఘా పెంచి గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని జోన్ల డీసీపీల పరిధిలో ప్రతీ రోజు 4 నుంచి 6 గంజాయి కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో కేసులో 2 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి 38 కేసులు నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. క్వింటాల్‌కుపైగా గంజాయిని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ కమిషరేట్లలోనూ వేట కొనసాగుతోంది. సైబరాబాద్‌లో క్రైమ్స్ విభా గం డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి 11 కేజీల గంజా యి స్వాధీనం చేసుకుని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో తనిఖీలు చేసి 38 కేసులు నమోదు చేశా రు. గంజాయి సిగరెట్లు విక్రయిస్తున్న పాన్షాపులపైనా దృష్టి పెట్టి 13 మందిపై కేసులు పెట్టారు. జిల్లాల్లోనూ ముమ్మరంగా... గంజాయి కట్టడికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కరీంనగర్‌లోని హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 11.6 కేజీల గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది. పోలీసులంతా ఎన్నికల బందోబస్తు, నేతల ప్రచారం, భద్రత వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఇదే అదనుగా భావించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీపీ సత్యనారాయణ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథనిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే, వరుసగా గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలుచేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 31 మందిపై, సైబరాబాద్‌లో ఆరుగురు, రాచకొండలో 8 మంది, నల్లగొండలో ఐదుగురు, ఖమ్మం, భద్రాచలం పోలీస్యూనిట్లలో 9 మందిపై పీడీ యాక్ట్ నమోదుచేశారు. గంజాయి సాగుపై నజర్ కొత్తగూడెం, రామగుండం కమిషనరేట్, ఆసిఫాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో గంజాయి సాగుపై ఇటు పోలీస్, అటు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతర్‌పంట పేరుతో గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి, పంటలను ధ్వంసం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని జాఫర్పల్లిలో, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పరిధిలోని కడ్తాల్లోనూ గంజాయి పంటను ఎక్సైజ్ అధికారులు «ధ్వంసం చేశారు. -
గంజాయి కట్టడికి టాస్క్‌ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి దందా ఆట కట్టించేందుకు పోలీస్–ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నేతృత్వంలో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు బుధవారం పోలీసు, ఎక్సైజ్ విభాగాలతో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఈ జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు వల్ల గంజాయి సరఫరా చైన్‌పై నిఘా పెరగడంతో పాటు అధికారులు, సిబ్బంది కూడా చొరవ చూపుతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రెండు విభాగాల నుంచి అధికారులు, సిబ్బందిని డెప్యూటేషన్‌పై తీసుకుంటారని తెలిసింది. పోలీసు నిఘా వ్యవస్థల ద్వారా అంతర్రాష్ట్ర డ్రగ్స్ కేసులను కూడా సులభంగా ఛేదించొచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘పీడీ’పెట్టినా జోరుగా గంజాయి.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పోలీసు, ఎక్సైజ్ విభాగాలు దాదాపు 1,200 కేసులు నమోదుచేసినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా 600కు పైగా కేసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోనే ఉన్నాయని, వీటి నియంత్రణకు పీడీ యాక్టులు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న డ్రగ్స్ కేసులు అధికారులను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 328 కేసులు నమోదు కాగా, 569 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ విభాగాల అధికారుల ద్వారా తెలిసింది. 1,500 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 58 డ్రగ్స్ కేసులు నమోదు చేయగా, 83 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 1,876 గ్రాముల కొకైన్, 312 గ్రాముల ఎండీఎంఏ, 151 ఎస్కటసీ పిల్స్‌ను సీజ్ చేశారు. పోలీస్ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 800కు పైగా కేసులతో పాటు, 1,200 మందిని కటకటాల్లోకి నెట్టినట్లు అధికారులు తెలిపారు. 4 క్వింటాళ్లకు పైగా గంజాయి సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులే లక్ష్యంగా.. రాష్ట్రంలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ మాఫియాలు దందా సాగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే 1,200లకు పైగా కేసులు నమోదయ్యాయంటే యువత ఏ స్థాయిలో గంజాయి మత్తులో తూగుతోందో అర్ధంచేసుకోవచ్చు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నా గంజాయి మాఫియా అంతకంతకూ వేళ్లూనుకుపోతూనే ఉంది. ఏకంగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రాం మెసెంజర్ల ద్వారా కోడ్ భాషల్లో గంజాయి అమ్ముతున్నట్టు తేలింది. విద్యార్థి దశలోనే మత్తుకు బానిసవుతున్న యువతను నియంత్రించాలంటే కఠినంగా వ్యవహారించాల్సిందేనని ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోనే కాకుండా జిల్లాల్లోని హెడ్క్వార్టర్లలో ఉన్న కాలేజీల్లో గంజాయి విపరీతంగా సరఫరా అవుతోందని, దీని కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవసరమని నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక అందించాయి. -
ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్..!
సంగారెడ్డి క్రైం: మారుమూల గ్రామాల్లోని గుట్ట, కొండ, కోనల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తూ ప్రధాన పట్టణాలు, నగరాల్లో విక్రయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న గంజాయి స్మగర్ల ఆగడాలకు సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెడుతున్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలోని శిలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్‌కు వ్యవసాయ భూమిలో గంజాయిని పండిస్తూ స్మగర్లకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. నిందితుడి ఇంట్లోనే 6.1 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అతనితో పాటు రూ.18150 నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ సీఐలు మోహన్‌కుమార్, రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు చేయాలన్న లక్ష్యంతో కొందరు అక్రమార్కులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే శీలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్ పథకం ప్రకారం తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయిని సాగు చేయడమే కాకుండా నిల్వ చేసుకొని ఎండు గంజాయిని ప్రతి నిత్యం ప్రధాన నగరాల్లో ,పట్టణాల్లో విద్యార్థులే లక్ష్యం విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడితో పాటు సరుకును ,నగదును స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయి విలువ రూ.30 వేల పైగా ఉంటుం ద ని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ విఠల్, రియాజ్, సిబ్బంది నగేష్, సిరాజ్, జయశ్రీ, జ్యో తి, సురేష్ పాల్గొన్నారు. -
రెండో రోజూ అన్నదాతపై దండయాత్ర
సుమారు 450 ఎకరాల్లో గసగసాల పంట ధ్వంసం ముగ్గురి అరెస్ట్ చౌడేపల్లె : చౌడేపల్లె మండలంలోని బోయకొండ సమీపంలో గల వివిధ గ్రామాల్లో గసగసాల పంటపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు పోలీసులు రెండో రోజైన బుధవారమూ దాడులు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం దాక దాడు లు చేసి, పంటను ట్రాక్టర్ల సాయంతో ధ్వంసం చేశారు. ఎక్సెజ్ డెప్యూటీ కమిషనర్ డీవీ.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్సుమెంటు స్క్వాడ్ ఉదయమే గ్రామాలకు చేరుకున్నారు. 13 టీములుగా ఏర్పడి బోయకొండ, భవానినగర్, మేకలవారిపల్లె, అట్లవారిపల్లె, దిగువపల్లె, కాగతి, పెద్దూరు, గజ్జలవారిపల్లె, ఎగువ గాజులవారిపల్లె, దిగువ గాజులవారిపల్లె, చిప్పిలేపల్లె, దాసరయ్యగారిపల్లె, మల్లువారిపల్లె, ఊటూరు, కొలింపల్లె, రాచవారిపల్లె, కోటూరు, పెద్దకొండామర్రి, చారాల, కాగతియల్లంపల్లె, వెంగలపల్లె, మోట్లపల్లె, కాటిపేరి, కరణంవారిపల్లె, మాదంవారిపల్లె తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన గసగసాల పంటను 450 ఎకరాల్లో ధ్వంసం చేశారు. ట్రాక్టర్ల సాయంతో దున్నేశారు. దళారుల మాటలు న మ్మి నిలువునా మోసపోయామని రైతులు బోరున విలపించారు. ఎన్డీపీఎస్ యాక్టు ప్రకారం ముగ్గురి అరెస్ట్ నార్కొటిక్ డ్రగ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం గసగసాలు పంట సాగుచేయడం నేరమని ఎక్సెజ్ సీఐ జానకిరామ్ బుధవారం తెలిపారు. రైతులకు గసగసాల పంట సాగుకు అవసరమైన విత్తనాలు, మార్కెటింగ్‌కు సహకరిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పెద్దూరుకు చెందిన సుబ్రమణ్యంశెట్టి, గజ్జలవారిపల్లె ఏ.వెంకటరెడ్డి, చౌడేపల్లెకు చెందిన ఈ.రెడ్డెప్పశెట్టిని పోలీసులు అరెస్ట్ చేశార. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సాయంతో వివరాల సేకరణ రెవెన్యూ అధికారుల సహాయంతో గసగసాలు పంట సాగుచేస్తున్న రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. రైతులు కూడా స్వచ్ఛందంగా సాగులో ఉన్న పంటను ధ్వంసం చేయాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఏఈఎస్ మధుసూదన, మల్లారెడ్డి, సీఐ చౌదరి, ఎస్ఐలు మనోహర్‌రాజు, ఇస్మాయిల్, దస్తిగిరి పాల్గొన్నారు. సదుం మండలంలో.. మండలంలోని రెడ్డివారిపల్లెలో ఇద్దరు రైతులు సాగు చేస్తున్న గసగసాల తోటలను రెవెన్యూ అధికారులు బుధవారం ధ్వంసం చేశారు. 60 సెంట్లలో పంటను ధ్వంసం చేసినట్లు తహశీల్దారు రేణుక తెలిపారు. వేలాది రూపాయలు వెచ్చించి పంట సాగు చేశామని, 20 రోజుల్లో పంట చేతికొచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గోవా టు నల్లగొండ
భువనగిరి : గోవా టు తెలంగాణ.. అందులోనూ నల్లగొండ.. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ నకిలీ మోనోగ్రామ్స్తో భారీగా నాన్‌డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) మద్యం తరలివస్తోంది. ఇటీవల జిల్లాలో ఎన్డీపీ అమ్మకాలు జరుపుతున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తీగ లాగి తే డొంకంతా కదులుతోంది. గోవా నుంచి కర్ణాటక మీదుగా సాగుతున్న ఎన్డీపీ మద్యం తెలంగాణలోని నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని రాజాపేట, యాదగిరి గుట్ట, రఘునాథపురం మద్యం దుకాణాల్లో పట్టుబడిన నాన్‌డ్యూటీ పెయిడ్ ఆఫీసర్స్ చాయస్ మద్యం వెనక భారీ కుంభకోణం దాగి ఉందని తెలుస్తోంది. ఇంతకుముందు హైదరాబాద్, గోవా కేంద్రంగా తయారవుతున్న ఈ మద్యం కర్ణాటక మీదు గా తెలంగాణ జిల్లాలకు సరఫరా అవుతోంది. మద్యం దుకాణాల్లో పనిచేస్తూ నాలుగు డబ్బులు సంపాదించిన వ్యక్తులు కింది స్థాయిలో ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములైనట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలింది. కర్ణాటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు తెలంగాణలోకి ఎన్డీపీ మద్యం రవాణా చేస్తున్నాడు. అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొంతకాలంగా నిఘా పెట్టడంతో ఎట్టకేలకు సంక్రాంతి పండగరోజు అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిం దితులను అదుపులోకి తీసుకున్న పోలీ సులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. గోవా నుంచి కర్ణాటక.. అటు నుంచి తెలంగాణలోకి పోలీసుల విచారణలో తెలిసిన సమాచారం మేరకు.. ఎన్డీపీ మద్యం గోవా డిస్టిలరీల నుంచి వస్తోంది. హైదరాబాద్, మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం వ్యాపారంలో ఉన్నారు. వారిలో ఒకరి బంధువు మంజునాథ్ కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ప్రముఖ వ్యాపారి, ఓ పార్టీకి చెందిన ఇతను గోవా నుంచి ఎన్డీపీ మద్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తెలంగాణలోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి రెండు నెలల సమయంలో ఆఫీసర్స్ చాయిస్ హోలోగ్రామ్ ముద్రించిన బాటిళ్లపై అనుమానం వచ్చింది. వీటిపై ఉన్న బ్యాచ్‌నంబర్ కూడా మల్కాజిగిరిలోని ఓ డిస్టిలరీకి సంబంధించినదిగా ఉంది. దీంతోపాటు జహీరాబాద్ ప్రాంతంలో ఆప్టెక్ (మద్యం దుకాణదారుల టార్గెట్) తగ్గుతూ వచ్చింది. డూప్లికేట్ హోలోగ్రామ్‌తో మద్యం అక్రమ రవాణ జరుగుతుందని భావించిన అధికారులు నిఘా పెంచారు. గత ఏడాది ఆగస్టు16న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనంలో రాయిచూర్ సమీపంలోని బసవకళ్యాణి వద్ద 8 వందల పెట్టెల ఆఫీసర్ చాయిస్ ఎన్డీపీ బాటిళ్లను గుర్తించారు. వైన్స్‌కు వచ్చేసరికి రూ.2,600 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ఒక కేసుకు మద్యం దుకాణం దరకు వచ్చే సరికి రూ.2,600 లభిస్తుంది. గోవా నుంచి ఒక కేసు మద్యం బాటిళ్లను రూ.1500లకు కొ నుగోలు చేసిన కర్ణాటకు చెందిన ఓ వ్యా పారి తన ఏజెంట్ల ద్వారా అమ్మకాలు సాగి స్తున్నాడు. గోవాకు చెందిన ఇమ్రాన్, ఆరీ స్లు గోవా డిస్టిలరీల నుంచి మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ హోలోగ్రామ్‌పై ప్రభుత్వ ముద్ర ఎన్డీపీ మద్యంపై ఉన్న నకిలీ హోలోగ్రామ్‌పై ప్రభుత్వం ముద్ర ఉంది. ఎన్పోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టగా అది అప్రూవ్డ్బై గవర్నమెంట్ ఉంది. హోలోగ్రామ్‌పై విచారణ చేపట్టగా మల్కాజిగిరి డిస్టిలరీకి చెందిన మ్యాక్డెవల్ బ్రాండ్‌కు ఇచ్చిన హోలోగ్రామ్ నంబర్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందే దానికి సంబంధించిన హోలోగ్రామ్ ప్రింట్ చేశారని సమాచారం. గోవా నిందితుల కోసం కొనసాగుతున్న వేట.. ఎన్డీపీ మద్యం ఎక్కడినుంచి వస్తుందన్న విషయంలో ఎక్సైజ్ పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వేట కొనసాగుతోంది. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మద్యం సరఫరా చేస్తున్న గోవాకు చెందిన వ్యాపారులను అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు గోవా డిస్టిబ్యూటరీల నుంచి వస్తున్న మద్యం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు సరఫరా అవుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు.