అక్టోబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ బ్యాంక్
చెన్నై: కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్యాంక్ కార్యకలాపాలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగలవని ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ ఐడీఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్ వెల్లడించారు. ముందుగా 20 శాఖలతో ప్రారంభిస్తామని, ఆ తర్వాత స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి క్రమక్రమంగా విస్తరిస్తామని ఆయన వివరించారు. మరోవైపు, కొత్త బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనకు కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి సంస్థ కార్యకలాపాలను విభజించే ప్రణాళికకు రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
గతేడాది ఏప్రిల్లో ఐడీఎఫ్సీ.. బ్యాంకింగ్ లెసైన్సు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ ఫైనాన్సింగ్ కార్యకలాపాలను విడగొట్టి ఐడీఎఫ్సీ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు గత నెల షేర్హోల్డర్ల నుంచి అనుమతి కోరింది. ఐడీఎఫ్సీ షేర్హోల్డర్లకు ప్రతిపాదిత ఐడీఎఫ్సీ బ్యాంకులో కూడా షేర్లు లభిస్తాయి. ఇలా ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లకు బ్యాంకు షేర్లను కేటాయిస్తున్నందువల్ల.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా లిస్టింగ్ చేయాలన్న నిబంధనను కూడా ఐడీఎఫ్సీ పాటించినట్లవుతుంది.