‘విద్యోన్నతి’ ప్రవేశ పరీక్షలు ప్రశాంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఉచితంగా సివిల్స్ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంపికకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఎన్టీయూలో రెండు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల, అనంత ఇంజినీరింగ్ కళాశాలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పరీక్షకు మొత్తం 2,451 మంది విద్యార్థులకు గాను 1,798 మంది హాజరయ్యారు. 653 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరిశీలకులుగా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న, హైదరాబాద్ నుంచి వచ్చిన గిరిజన సంక్షేమశాఖ డీడీ మణికుమార్ వ్యవహరించారు. ఆయా కేంద్రాలను పరిశీలించారు. వారివెంట డీఎస్డబ్ల్యూఓ లక్ష్మానాయక్, డీటీడబ్ల్యూఓ కొండలరావు ఉన్నారు.