కొత్త చట్టం కింద పరిహారం ఇవ్వండి
రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నుంచి ద్వారకా హోటల్ వరకు రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణకు పరిహారం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో జమ చేయకుంటే బాధితులకు 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం జమ చేయని పక్షంలో పాత భూ సేకరణ చట్టం కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్ రద్దైనట్లేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే భూమిని సేకరించి అందులో రహదారిని ఏర్పాటు చేసినందున పిటిషనర్‌కు కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారాన్ని మూడు నెలల్లో చెల్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి లక్డీకాపూల్ ద్వారకా హోటల్ వరకు రోడ్డు విస్తరణ నిమిత్తం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాంప్రకాశ్ అగర్వాల్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని, భవనాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. పరిహారం చెల్లింపునకు 1999లో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తరువాత ఈ వ్యవహారం పలు వివాదాల నేపథ్యంలో సివిల్ కోర్టుకు చేరింది.
అయితే అధికారులు మాత్రం చెల్లించాలని నిర్ణయించిన పరిహార మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయలేదు. వివాదం సమసిన తరువాత అధికారులు పాత చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధం కాగా, అందుకు అగర్వాల్ నిరాకరిస్తూ తనకు 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు.