Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది.
చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి.
3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు.
4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది.
5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు.
6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు.
7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది.
8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం.
9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం.
రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు.
Follow the Sakshi TV channel on WhatsApp