ఇంతకీ నల్లడబ్బు ఎక్కడ?
ఇంతకీ నల్లడబ్బు ఎక్కడ?
Published Fri, Nov 18 2016 4:46 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
'నల్ల డబ్బు ఎక్కడో లేదు. బులియన్ మార్కెట్‌లో, బినామీ భూదందాల్లో, విదేశీ కరెన్సీల్లో ఉంది. నల్లడబ్బును వెలుగులోకి తీసుకరావడానికి పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. 1946, 1978లలో రెండుసార్లు పెద్దనోట్లను రద్దుచేసినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు' ఈ వ్యాఖ్యలు చేసింది రాజకీయ నాయకులెవరూ కాదు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 'మెజర్స్ టు టాకిల్ బ్లాక్‌మనీ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్' పేరిట 2012లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నివేదిక గురించి 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కచ్చితంగా తెలిసే ఉంటుంది. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంతో చూడకుండా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించే కోణంలోనే చూడాలి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నానారభస సష్టించి తద్వారా వాటిని వాయిదా వేయించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఏ ప్రతిపక్ష పార్టీ ప్రయత్నించరాదు.
మోదీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా దేశంలో ఏర్పడిన ఆర్థిక కల్లోల పరిస్థితులపై పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చకు కృషి చేయాలి. వాస్తవ అవాస్తవాలు ప్రజలకు తెలియాలి. మోదీ నిర్ణయం వెనక లెక్కలేమిటో నిలదీయాలి. పరిస్థితులేమిటో పసిగట్టాలి, ప్రశ్నించాలి. రాజకీయ పార్టీలు, నాయకుల అవినీతే నల్లడబ్బుకు దారితీస్తోందని అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరగాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నాలుగు రోజుల్లోనే మూడు లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిన లెక్కల్లో నల్ల డబ్బు ఎంతో, తెల్లడబ్బు ఎంతో తేల్చాలి. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ఎంత మంది అమాయకులు మరణించారో, వారి ప్రాణం ఖరీదు ఎంతో కూడా లెక్క చూపాలి.
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్
Advertisement
Advertisement