ఏడాది లోగా కొత్త తాలూకాలు
కమిటీల నివేదికలు పరిశీలించి నిర్ణయం : సీఎం
సాక్షి, బెంగళూరు : నూతన తాలూకాల ఏర్పాటు విషయమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గుల్బర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. నూతన తాలూకాల ఏర్పాటుపై నాలుగు వేర్వేరు కమిటీలు ఇచ్చిన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు.
వీటి సిఫార్సులలో ఉత్తమమైనవాటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆర్థిక, పాలన పరమైన ఇబ్బందులు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక ఏడాదిలోపు నూతన తాలూకాల ఏర్పాటు విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి రూ.426 కోట్లను పరిహారంగా ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు.
ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకకు రానున్నారని, ఆ సమయంలో పరిహారం విషయమై ఆయనతో చర్చించనున్నట్లు చెప్పారు. గుల్బర్గాలో అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోటెక్నాలజీకు సంబంధించిన పరిశ్రమలను స్థాపించాలనే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
హైదరాబాద్ - కర్ణాటక విమోచన పోరాట గాథలకు సంబంధించిన విషయాలను అక్షరబద్ధం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన ప్రత్యేక మండలికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతంలోని జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని నూతన పారిశ్రామిక విధానంలో పొందుపరిచామని తెలిపారు.