ప్రపంచాన్ని అన్వేషించారిలా..
సాక్షి: ప్రపంచంలో ఏ దేశం ఏమూలన ఉందంటే ప్రస్తుతం టక్కున చెప్పేస్తున్నాం. కానీ పదిహేనవ శతాబ్దానికి ముందు విదేశాల గురించి తెలిసింది తక్కువే. ఎక్కడ ఏ దేశం ఉందో తెలిసేది కాదు. అయితే ఐరోపా వాసులు సాగించిన యాత్ర మనకు ప్రపంచ దేశాల్ని పరిచయం చేసింది. వారు ప్రధానంగా ఇండియాను కనుగొనేందుకు మొదలుపెట్టిన యాత్ర అనేక ఇతర దేశాల్ని కనుగొనేందుకు కారణమైంది. ఇలా ఆ రోజుల్లో నావికులు సాగించిన యాత్రల్లో కొన్ని ప్రధాన ఘట్టాలు, నావికుల గురించి తెలుసుకుందాం..
15వ శతాబ్దంలో నాంది..
ప్రపంచ చరిత్రలో అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన కాలంగా పదిహేనో శతాబ్దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శతాబ్దం నుంచే నావికులు ఇతర దేశాల్ని అన్వేషిస్తూ సముద్రయానం సాగించారు. ఇది కొత్త దేశాలను గుర్తించేందుకు, ప్రపంచం గురించి తెలిసేందుకు దోహదపడింది. ముఖ్యంగా ఇండియాను కనుగొనేందుకు చేసిన యాత్ర కొత్త దేశాలు కనుగొనేందుకు దారితీసింది. అందుకే చరిత్రకారులు పదిహేనో శతాబ్దాన్ని ఆవిష్కరణ/అన్వేషణల యుగం అంటారు.
కారణం ఇదీ..
అనేక దేశాలకు చెందిన వారు విదేశాలను అన్వేషించినా, వారిలో ఐరోపా అన్వేషకులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు ప్రధానంగా ఇండియాను అన్వేషిస్తూ బయలుదేరారు. అన్వేషణ మొదలుపెట్టేందుకు అనేక కారణాలున్నాయి. 15వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వ్యాపారం ఊపందుకోవడంతో కొత్త వ్యాపారులు ఎక్కువయ్యారు. వీరు ఎక్కువగా ఇండియా నుంచి బంగారం, వజ్రాలు, పట్టు, తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకుని తమ దేశంలో అమ్మకాలు సాగించారు. అలాగే మసాలా దినుసుల్ని కూడా ఇండియా నుంచి దిగుమతి చేసుకునేవారు. మరోవైపు ఆహారంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
మాంసాన్ని నిల్వ చేసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. దీని కోసం మాంసాన్ని ఎండబెట్టి, దానిపై ఉప్పు చల్లి నిల్వ చేసుకునేవారు. మాంసాహారానికి ఇండియా, ఆసియాల నుంచి లభించే మసాలా దినుసులను జత చేసే విధానం బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ మసాలా దినుసులకు డిమాండ్ పెరిగింది. అయితే ఆసియా దేశాల నుంచి ఐరోపాకు వాటిని దిగుమతి చేసుకోవడం వారికి పెద్ద కష్టంగా ఉండేది. అప్పట్లో ఆసియాకు, ఐరోపాకు మధ్య భూ మార్గం ఉండేది. కానీ అది టర్కీ రాజుల ఆధీనంలో ఉండడంతో వ్యాపారులు వారివల్ల ఇబ్బందులు పడేవారు. దీంతో భూ మార్గం గుండా కాకుండా జల (సముద్ర) మార్గం గుండా రవాణా చేస్తే ఈ సమస్యలుండవని వారు భావించారు. ఈ నేపథ్యంలో ఇండియా, ఇతర ఆసియా దేశాలకు వెళ్లేందుకు పలువురు ఐరోపా వాసులు సముద్రమార్గాన్ని కనుగొనేందుకు అన్వేషణని ప్రారంభించారు. వీటిలో ప్రధానమైన అన్వేషణలు ఇవి.
క్రిస్టోఫర్ కొలంబస్..
ప్రపంచ అన్వేషకుల్లో ప్రముఖుడు కొలంబస్. ఇండియాను అన్వేషిస్తూ ఇతడు సముద్రయానం ప్రారంభించాడు. 1492లో ఇండియాను కనుగొనేందుకు బయలు దేరాడు. ఈ క్రమంలో ఓ కొత్త భూభాగానికి చేరుకున్నాడు. తాను చేరింది ఇండియానే అని భావించాడు. కానీ అతడు చేరుకుంది అమెరికాకు. అలా కొలంబస్ వల్ల అమెరికా గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత కూడా అతడి సముద్రయానం కొనసాగింది. కొలంబస్ తర్వాత స్పెయిన్‌కు చెందిన నావికుడు పోన్స్ డి లియోన్ 1513లో ఫ్లోరిడాను కనుగొన్నాడు.
పోర్చుగీస్ నావికులు..
15వ శతాబ్దం చివరిలో పోర్చుగీసుకు చెందిన అనేక అన్వేషకులు ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అన్వేషిస్తూ నౌకాయానం ప్రారంభించారు. ఆఫ్రికా తీరం వెంట ప్రయాణించడం ద్వారా ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొనాలని వారి ఉద్దేశం. అలా 1487లో బర్తోలోమో అనే అన్వేషకుడు ఆఫ్రికా తీరానికి చేరుకునే సమయానికి పెద్ద తుపాను రావడంతో గమ్యాన్ని చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ తిరుగు ప్రయాణంలో ఓ భూ భాగాన్ని ఆయన బృందం కనుగొంది. ఈ భూభాగం ద్వారా ఇండియాకు చేరుకోవచ్చని వారు భావించారు. అనంతరం వాస్కోడిగామా 1497లో ఇదే మార్గం గుండా యాత్ర సాగించాడు. చివరకు 1498 మేలో ఇండియాకు చేరుకున్నాడు. ఈ విషయాన్ని తన వారికి తెలిపేందుకు ఇక్కడి నుంచి కొంత బంగారం, కొన్ని మసాలా దినుసులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.
స్పానిష్ నావికులు..
15వ శతాబ్దం ప్రారంభంలో పలువురు స్పెయిన్ నావికులు ఉత్తర, సెంట్రల్ అమెరికాకు ప్రయాణించేవారు. తమతోపాటు కొంతమంది వలసవాదుల్ని ఆ దేశాలకు తీసుకెళ్లేవారు. అమెరికాలో ఉండని గోధుమ, గుర్రాలు, గొర్రెలను అక్కడికి తీసుకెళ్లేవారు. బదులుగా తిరిగి వెళ్లేప్పుడు ఐరోపాలో లభించని మొక్కజొన్న, బంగాళాదుంపల్ని తమ భూభాగానికి తీసుకెళ్లేవారు. 1513లో వాస్కోడి బాల్బోవా ఇలా నౌకాయానం చేస్తూ అమెరికాలోని పనామాకు చేరుకున్నాడు. అనంతరం అక్కడి అడవిలో దాదాపు యాభై మైళ్లు దారితెలియక ప్రయాణించినఅతడు చివరకు తిరిగి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
ఫ్రెంచ్, ఆంగ్లేయుల అన్వేషణ..
వీరు ఎక్కువగా తమ దేశాలకు ఉత్తర దిక్కుగానే అన్వేషణ సాగించారు. దీనికి కారణం ఉత్తర, వాయువ్య దిశల్లో తమ దేశం నుంచి కూడా ఇండియాకు సముద్ర మార్గం ఉందని వారు భావించడమే. 1497లో ఇటలీకి చెందిన జాన్ కోబట్ అనే నావికుడు ఇంగ్లండ్‌కు నౌకాయానం ద్వారా బయలుదేరాడు. కానీ అతడు కెనడాకు చేరుకున్నాడు. 15వ శతాబ్దం చివరిలో, 16వ శతాబ్దం మొదట్లో పలువురు నావికులు అనేక దేశాలను అన్వేషిస్తూ సముద్రయానం ప్రారంభించారు.
మ్యాగెల్లాన్ యాత్ర..
అన్వేషకుల్లో మరో చెప్పుకోదగ్గ నావికుడు మ్యాగెల్లాన్. పోర్చుగీసుకు చెందిన ఇతడు 1519లో ఇండియాను కనుగొనేందుకు దక్షిణ అమెరికా తీరం వెంబడి యాత్ర ప్రారంభించాడు. దాదాపు ఐదు భారీ పడవలు, 240 మంది సిబ్బందితో ఇతని అన్వేషణ ప్రారంభమైంది. ఈ క్రమంలో దక్షిణ అమెరికా తీరానికి సమీపంలో ఉండగా భారీ తుపాను ప్రభావంతో రెండు పడవలు ధ్వంసమయ్యాయి. తర్వాత మూడు పడవలతోనే సన్నగా ఉండే సముద్ర మార్గం గుండా అతడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
దీంతో ఆ దారికి మ్యాగెల్లాన్ మార్గం అనే పేరు వచ్చింది. పసిఫిక్ సముద్రం వెంట అతడు యాత్ర సాగిస్తుండగా దాదాపు మూడు నెలలపాటు ఏ భూభాగం కనిపించలేదు. ఇలా మూడు నెలలు యాత్ర సాగించిన తర్వాత 1521 ఏప్రిల్‌లో ఫిలిప్పైన్ దీవులకు చేరుకున్నాడు. అయితే అక్కడి దీవుల్లో నివసించే వారు అతడ్ని చంపేశారు. చివరకు ఒకే పడవ తన యాత్రని సాగించింది. నావికుల చరిత్రలో ఇతడి ఘట్టం ప్రత్యేకంగా నిలిచిపోయింది.