పీజీ వైద్యుల కౌన్సెలింగ్ అడ్డగింతకు యత్నం
123 మంది జూనియర్ వైద్యుల అరెస్టు...రాణాలకు తరలింపు
హైదరాబాద్: పీజీ పూర్తి చేసిన వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ఏడాది పాటు పనిచే సేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జూనియర్ వైద్యులు కోఠి డీఎంఈ ఆడిటోరియంలో బుధవారం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌ను అడ్డుకోవటం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. ఏడాది పాటు గ్రామాల్లో పనిచేస్తామని కొందరు పీజీ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా వ్యతిరేకిస్తున్న వారు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు 123 మంది జూడాలను అదుపులోకి తీసుకుని మలక్‌పేట్, సైదాబాద్, సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లకు తరలించి, కౌన్సెలింగ్‌ను కొనసాగిం చారు. కాగా, జూడాల అరెస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.రమేశ్, తెలంగాణ మెడికల్ జేఏసీ కన్వీనర్ జె.రాజేందర్ ఖండించారు.
అత్యవసర వైద్య సేవల బంద్..
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రి, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి, ఉస్మానియా తదితర ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలను బహిష్కరించారు.
561 మంది టు పోస్టింగ్‌లు
పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఎంఎస్, ఎండీ వైద్య కోర్సులను పూర్తిచేసిన 561 మంది వైద్యులకు ఏడాది ప్రభుత్వ సర్వీసు కింద పోస్టింగ్‌లు ఇచ్చినట్టు తెలంగాణ వైద్యవిద్యా సంచాలకుడు డా.పుట్టా శ్రీనివాస్ తెలిపారు. వీరంతా ఉస్మానియా, గాంధీ, కాకతీయ (వరంగల్), ప్రభుత్వ వైద్యకళాశాల (నిజామాబాద్), రిమ్స్(ఆదిలాబాద్)లలో పనిచేస్తారని పేర్కొన్నారు. కాగా, త్వరలోనే డిప్లొమా అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇస్తామన్నారు.