కంటి విభాగంలో కోల్డ్‌వార్..!
విజయనగరం ఆరోగ్యం :కేంద్రాస్పత్రిలోని కంటి విభాగంలో రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆప్తాలమిక్ అసిస్టెంట్లు, నర్సింగ్ సిబ్బందికి మధ్య కొంతకాలంగా అంతర్యుద్ధం నడుస్తున్నట్లు సమాచారం. దీంతో వీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే విచారణ చేసి న్యాయం అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పక్షపాత ధోరణి వల్ల ఇద్దరు ఉద్యోగులు సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటి విభాగంలో పనిచేస్తున్న ఆప్తాలమిక్ అసిస్టెంట్లపై అదే విభాగంలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది కంటి విభాగం అధికారికి, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అప్తాలమిక్ అసిస్టెంట్లు విధి నిర్వాహణలో తమకు సహాకరించడం లేదని, కామెంట్లు చేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే నర్సింగ్ సిబ్బంది కూడా తమను కించపరుస్తున్నట్లు ఆప్తాలమిక్ అసిస్టెంట్లు కంటి విభాగం అధికారికి, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ రెండు ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుని విచారించాల్సిన అధికారులు ఏకపక్షంతో వ్యవహారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. నర్సింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకుని కంటి విభాగం అధికారి అప్తాలమిక్ అసిస్టెంట్ల సేవలు తమకు అవసరం లేదని వారేచోటకు బదిలీచేయడం లేదా సరెండ్ర్ చేయాలని సూపరింటెండెంట్‌కు సిఫార్సు చేసినట్టు తెలిసింది. దీంతో సూపరింటెండెంట్ అప్తాలమిక్ అసిస్టెంట్లను సరెండర్ చేయాలని సిఫార్సు చేస్తు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి( డీసీహెచ్ఎస్), వైద్య విధాన్ పరిషత్ కమిషనర్‌కు లేఖలు రాశారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే అప్తాలిమిక్ అసిస్టెంట్లు ఇచ్చే ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకపోవడం గమనర్హాం.
అధికారులు ఏకపక్షంగా వ్యవహారించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా అప్తాలిమక్ అసిస్టెంట్లను సరెండర్ చేయాలని లేఖలు రాసిన మాట వాస్తవమేనని అంగీకరించారు.