మేకప్ కిట్
ముఖారవిందానికి బ్రష్‌లు...
మేకప్ కిట్‌లో ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనవి మేకప్ బ్రష్‌లు. సరైన బ్రష్‌లను ఉపయోగిస్తే చిన్న స్ట్రోక్స్‌తోనే మెరుగైన మేకప్‌ని పూర్తిచేసుకోవచ్చు. చాలామంది చేతినిండా పట్టేటంత బ్రష్ తీసుకొని మేకప్ వేసుకుంటుంటారు. దీని వల్ల అత్యంత సాధారణ లోటుపాట్లను కూడా సరిచేసుకోలేరు. అందుకే కొనుగోలు చేయడానికి ముందు ఎలాంటి మేకప్ బ్రష్‌లు అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సౌందర్యసాధనాలలో బ్రష్‌ల పాత్ర కీలకమైనది.
పౌడర్ బ్రష్: ఇది సాధారణంగా అందరు వాడే బ్రష్. కాంపాక్ట్ వాడేటప్పుడు ఈ బ్రష్‌ని ఉపయోగిస్తే పౌడర్ ప్యాచ్‌లుగా ముఖానికి పట్టదు. బ్లషర్ బ్రష్: బుగ్గల మీద అద్దే కాంపాక్ట్ కోసం చాలామంది పౌడర్ బ్రష్‌నే బ్లషర్గా వాడతారు. పౌడర్ బ్రష్ కన్నా బ్లషర్ పెద్దగా ఉంటుంది. బ్లషర్‌ని ఉపయోగించడం వల్ల ఒకటి రెండు స్ట్రోక్స్‌తోనే చక్కని మార్పు తీసుకురావచ్చు. ఐ షాడో బ్రష్: ఈ బ్రష్‌లు సాధారణంగా ఫ్లాట్‌గా ఉంటాయి. వీటితో కంటి చుట్టు భాగాన్ని అందంగా తీర్చిదిద్దవచ్చు. ఐ లైనర్ బ్రష్: ఐ లైనర్ బ్రష్‌ను పెన్సిల్ గీతలా ఉపయోగించవచ్చు.
ఐ లైనర్ స్మడ్జర్: దీనిని పూర్తి బ్రష్‌గా చెప్పలేం. కుచ్చుల స్థానంలో పలచని స్పాంజ్ ఉంటుంది.
పర్యావరణ అనుకూల బ్రష్‌లు: బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌తో రూపొందించిన బ్రష్‌ల వల్ల హానికరమైన టాక్సిన్ల నుంచి, హానికరమైన రసాయనాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవచ్చు. మేకప్ బ్రష్‌ల ఎంపికకు మీ సౌందర్య నిపుణల సలహా తీసుకోవచ్చు.