సక్రమ ట్యాపింగ్ నేరం కాదు
ఫిర్యాదుదారు వాంగ్మూలం, ఇతరుల వాంగ్మూలాలు, మౌఖిక సాక్ష్యాలు పరిస్థితుల సాక్ష్యాలు, నగదు మూట, నగదు వనరులు, మోసిన వారు, తీసిన వారు, సీసీ కెమెరాల ఫుటేజీ ఇవన్నీ కలిస్తే నేరం రుజువు చేయడం అసాధ్యం కాదు.
నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కోట్లలో ఇస్తాను. నీ ఓటు ఫలానా వాడికే ఇవ్వు అని చెప్పడం లంచం తీసుకోవడమనే నేరాన్ని ప్రేరేపించడం అవుతుంది. ఫలానా వారు ఈ నేరం చేయవచ్చు, మిగిలిన వారెవరూ చేయడానికి వీల్లేదని చట్టంలో రాజ్యాంగంలో మినహా యింపులేవీ లేవు. పరోక్షంగా కూడా లేవు. ఆ ఇల్లు తగలబెట్టు అని చెప్పే వాక్ స్వాతంత్య్రాన్ని ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా ఇవ్వలేదు.
ప్రైవసీ అంటే ఏమిటో నిర్వచించే ఎన్ని తీర్పులు సుప్రీం కోర్టు వివరించినా శ్రీశ్రీ కన్నగొప్పగా చెప్పలేదు. ‘ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్‌గా ఉంటే ఏమై నా అంటాం, అంటాం టాం టాం, టాం టాం.’ ప్రైవసీ అంటే ఎవరి బతుకు వారు బతికే అవకాశం ఉండడం. ఇది సంవిధా నంలోని అధికరణం 21లో ప్రకటించిన జీవన హక్కులో అంత ర్భాగమైన పౌర అధికారం అని సుప్రీంకోర్టు విశదీకరించింది. టెలిఫోన్ సంభాషణలు రహస్యంగా వినడాన్ని ట్యాపింగ్ అని అంటున్నారు. గోడ చెవులన్నమాట. గోడ చెవిగాళ్లు సొంతబ తుకు హక్కుకు తూట్లు పొడిచేవారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 అనే ఒక పాత బ్రిటిష్ వారి చట్టం మనం స్వతంత్ర భారతదేశంలో అమలు చేసుకుం టున్నాం. అందులో సెక్షన్ 5(2) ఫోన్ రహస్యాలు వినే విధా నాన్ని వివరిస్త్తున్నది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రజా రక్షణ, పబ్లిక్ ఆర్డర్, విదేశీ స్నేహసంబంధాలు కాపాడడానికి లేదా ఒక నేరాన్ని ప్రేరేపించడాన్ని నివారించడానికి గాను ఫోన్ తీగలకు చెవులు పెట్టవచ్చుననీ, అందుకు సంబంధిత రాష్ర్ట లేదా కేంద్ర ప్రభుత్వ అధికారి సహేతుకమైన అనుమతి ఉండ డం అవసరమనీ వివరించిందీ సెక్షన్. రాజ్యాంగం 1950లో వచ్చిన తరువాత వ్యక్తిగతంగా మాట్లాడుకునే స్వేచ్ఛ భావ స్వేచ్ఛలో భాగమని ఆర్టికల్ 19(1) (ఎ)లో ప్రకటించారు. దానికి దేశభద్రత, విదేశీ స్నేహ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ రక్షణ, నేర ప్రేరకాల నివారణ, ప్రజావసరాల ఎమర్జెన్సీ, ప్రజా భద్రతావసరం భావప్రకటన స్వేచ్ఛపై పరిమితులు, టెలిగ్రాఫ్ చట్టం, ఆర్టికల్ 19, కలిపి చదివితే అర్థమయ్యేదే మంటే, ప్రైవసీని, మాట్లాడే స్వేచ్ఛను నేరాలు చేయమని మరొకరిని ప్రోత్సహించడానికి వాడకూడదని.
టెలిగ్రాఫ్ సవరణ చట్టం 1971, సెక్షన్ 7(2)(బి)లో టెలి ఫోన్ సందేశాలను సంభాషణలను చాటుగా వినేందుకు, వెల్ల డిచేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసే నియ మాలను చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ చట్టం సవరిం చారు. కేంద్రప్రభుత్వం ఈ నియమాలు చేయాలి.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, పీయూసీ సి ఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (ఏఐఆర్ 1997 ఎస్ సి 597)లో సుప్రీంకోర్టు... ఫోన్లో మాటలు చాటుగా విన డం రికార్డు చేయడం వ్యక్తి ప్రైవసీ హక్కుకు ఉల్లంఘన అవు తుందని, కనుక ఆ విధంగా వినే ఉత్తర్వులు జారీ చేసే అధికా రాన్ని సక్రమంగా వినియోగించేందుకు మార్గదర్శకాలు ఉండి తీరాలని తీర్మానించి ఆ మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలో వివరించింది. వాటికి లోబడి ప్రభుత్వం నియమాలు చేయవ లసి ఉంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో హోం కార్యదర్శులు మాత్ర మే దూరభాషిణీ రహస్య శ్రవణాదేశాలను జారీ చేయవచ్చని సమున్నత న్యాయస్థానం ఆదేశించింది.
సక్రమంగా రికార్డు చేసిన ఫోన్ మాటలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, కెమెరా దృశ్యాలను సాక్ష్యాలుగా అనుమతించేం దుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ద్వారా భారత సాక్ష్య చట్టాన్ని సవరించారు. పత్రాల సాక్ష్యంతో సమానంగా ఈ సాక్ష్యాలకు కూడా బలం ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి కేసులను బట్టి ఆ సాక్ష్యానికి ఎంత విలువ ఇవ్వాలనే విషయం న్యాయాధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఎస్. ప్రతాప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (19644.C.R.733)లో ముఖ్యమంత్రి భార్యకు ఒక డాక్టరుకు మధ్య జరిగిన సంభా షణ ఫోన్ రికార్డును బట్టి వారి మధ్య ఆ మాటలు నడిచాయని కోర్టు సాక్ష్యంగా ఆమోదించింది. యూసుఫ్ ఆలీ ఇస్మాయిల్ నాగరీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట ఏఐఆర్ 1968 సుప్రీం కోర్టు 147 కేసులో ఒక అధికారికి యూసుఫ్ ఆలీ లంచం ఇవ్వ జూపాడు.
అతను తీసుకోలేదు. పోలీసులకు ఆ అధికారి ఫిర్యా దు చేశాడు. యూసుఫ్ ఆలీని తన ఇంటికి రమ్మన్నాడు ఆ అధి కారి. అక్కడికి యూసుఫ్ ఆలీ వచ్చి లంచం ఇస్త్తుండగా ట్రాప్ చేశారు. గదిలో వాళ్లిద్దరే ఉన్నారు. ఆ గదిలో ఒక మైక్రోఫోన్‌ను దాచారు. పక్కగదిలో ఒక రేడియో మెకానిక్ పోలీసు అధికా రులు కూర్చుని రహస్యంగా వారి సంభాషణను రికార్డు చేశా రు. ఫిర్యాదు చేసిన అధికారి ఒక్కరే లంచం ఇచ్చే నేరానికి ప్రత్యక్ష సాక్షి. యూసుఫ్ ఆలీకి ఈ సాక్ష్యాల ఆధారంగా లం చం నేరానికి శిక్ష పడింది. లంచం ఇచ్చే కార్యం చుట్టూ అల్లు కున్న సంభాషణ సాక్ష్య చట్టం సెక్షన్ 8 కింది ‘రెస్ జెస్టే’ అవు తుంది. అధికారి ఫిర్యాదు వాంగ్మూలాలకు, ఈ మాటల ధ్వను లున్న టేప్ రికార్డు బలపరిచే సాక్ష్యం అవుతుంది. ఫొటోగ్రాఫ్ వలె అది కూడా ఆ పరిస్థితిని బలపరుస్త్తుందని సుప్రీంకోర్టు వివరించింది. ఈ విధంగా బలీయమైన సాక్ష్యం కావడానికి ఇది ఎప్పుడు ఎక్కడ రికార్డయిందో రుజువు చేయవలసి ఉం టుంది. మాగ్నటిక్ టేప్పైన రికార్డు చేసిన మాటలను తొల గించి మళ్లీ రికార్డు చేసే వీలుంది కనుక, ఆ విధంగా జర గలేదని శాస్త్రీయంగా రుజువు చేయడం కూడా మరొక అవ సరం. ఈ రెండూ రుజువైతే రికార్డు తిరుగులేని సాక్ష్యం అవు తుందని సుప్రీంకోర్టు ఈ కేసులో తేల్చి చెప్పింది.
రేవంత్‌రెడ్డి కేసులో ఫోన్ ట్యాపింగ్ జరిగితే అందుకు తగిన ఉత్తర్వులు ఉన్నాయని తేలడం అవసరం. సక్రమంగా ప్రక్రియను పాటిస్తే ఆ ట్యాపింగ్ ద్వారా వచ్చిన వివరాలు సాక్ష్యాలు అవుతాయి. ఫోన్ రికార్డింగ్ సాక్ష్యాలు, కెమెరాలు తీసిన వీడియో రికార్డింగ్‌లు రికార్డయిన స్థలం, సమయం తది తర వివరాలు రుజువైతే, ఇవి కత్తిరించి అతికించినవి కావని మొదటి రికార్డింగ్ వలెనే ఉన్నాయని శాస్త్రీయమైన (ఫోరె న్సిక్) రుజువులు ఉంటే బలీయమైన సాక్ష్యాలు అయ్యే అవ కాశం ఉంది. కాల రికార్డు వివరాలు, ఫిర్యాదుదారు వాం గ్మూలం, ఇతరుల వాంగ్మూలాలు, మౌఖిక సాక్ష్యాలు పరిస్థి తుల సాక్ష్యాలు, నగదు మూట, నగదు వనరులు, మోసిన వారు, తీసిన వారు, సీసీ కెమెరాల ఫుటేజీ ఇవన్నీ కలిస్తే నేరం రుజువు చేయడం అసాధ్యం కాదు.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com
- మాడభూషి శ్రీధర్