ఏడాదిపాటు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఫొటోలు తీసి..
సెయింట్ లూయిస్: ఫేస్బుక్ అనగానే అదో దగ్గరగా ఉన్నట్లు అనిపించే దూరంగా ఉండే మనుషుల గుంపు. ఇందులో ఒకరికి ఒకరు తెలిసినవారితోపాటు తెలియని వారు కూడా ఉంటారు. ఫేస్ బుక్ ఖాతా తెరవగానే తొలుత స్నేహితులకు ప్రాధాన్యం ఇచ్చి వారిని యాడ్ చేసుకున్నా.. తర్వాత మాత్రం తెలియనివారినే ఎక్కువగా స్నేహితులుగా చేసుకుంటుంటాం. ఆలోచనలు, ఫోటోలను పంచుకోవడం ద్వారా ఒకరంటే ఒకరికి ఓ రకమైన అభిమానం ఏర్పడి వెంటనే స్నేహితుడిగా ఆహ్వానిస్తాం.
అయితే, ఇలా మీ ఫేస్ బుక్ లో వందల నుంచి వేలమంది స్నేహితులు ఉంటుంటారు. కానీ, చాలామందికి వారి అసలైన ఫేస్ లు ఎలా ఉంటాయో తెలియదు. అందుకు ప్రధాన కారణం చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్ ను ఒరిజినల్ గా పెట్టరు.. ఫ్లవరో, ప్రకృతి, ఇష్టమైన జంతువో, డిజైనో లేదంటే తమకు నచ్చిన హీరోనో హీరోయిన్ నో ప్రొఫైల్ పిక్ గా పెడుతుంటారు. ఇలా ఉండటం వల్ల మీ ఫేస్ బుక్ స్నేహితుడు మీ పక్కనే ఉన్నా, మీరు ప్రయాణించే సమయంలో మీ పక్క సీట్లోనే ఉన్నా గుర్తించే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎప్పుడైన మీ ఫేస్ బుక్ స్నేహితులు అసలు ఎలా ఉంటారోనని చూడాలనిపించిందా..
సరిగ్గా సెయింట్ లూయిస్‌కు చెందిన కోరే వూడ్రఫ్ అనే ఫొటో గ్రాఫర్ కు అలాగే అనిపించింది. వెంటనే చేతిలో కెమెరా తీసుకొని ఒక ఏడాది కాలంపాటు తన ఫేస్ బుక్ స్నేహితుల అసలైన ఫేస్ లను క్లిక్ మనిపించే పనిలో పడ్డాడు. అలా మొత్తం 738 మంది ఫేస్ బుక్ స్నేహితుల ఫొటోలను తీసుకున్నాడు. అవి కూడా సాదాసీదాగా కాకుండా తన ఐడియాలను జొప్పించి ఓ ఫొటో గ్రాఫర్ గా తన ప్రతిభ చాటుకున్నాడు. చక్కటి ఆల్బమ్ రూపొందించాడు. ఈ ఫొటోలు మొత్తం తీయడానికి ముందు పెద్ద కసరత్తే చేశాడు. ఫొటోలు తీయడానికి ముందు వారి అనుమతి కూడా వూడ్రఫ్ తీసుకున్నాడు.