నమ్మకపోటు
• సోల్ / వెన్నుపోటు
వెన్నుపోటు... నమ్మకద్రోహం... మానవజాతిలో ఇదేమీ కొత్త అవలక్షణం కాదు. నాగరికత మొదలైన నాటి నుంచి ఉన్నదే. ఆధునిక రాజకీయాల్లోనే కాదు, పురాణాల్లోను, చరిత్రలోను కూడా వెన్నుపోటు ఉదంతాలు కొల్లలుగా కనిపిస్తాయి. ఆశించిన అందలాలెక్కడానికి పనికొచ్చే ఎలాంటి నైపుణ్యాలనూ జీవితంలో సాధించలేని కొందరు అదేపనిగా సాధనచేసి వంచనాశిల్ప నైపుణ్యంలో ఆరితేరిపోతారు. తమ తమ నెలవులలో, కొలువులలో నమ్మకంగా కొనసాగుతూనే, తమపై నమ్మకం పెంచుకున్న వారు ఆదమరచిన వేళ అదను చూసి వెన్నుపోటు పొడుస్తారు. నమ్మకద్రోహుల్లో కొందరు అక్షరాలా వెన్నులో కత్తి దించేస్తారు. నమ్మకద్రోహుల్లో కొందరు పాపం అహింసావాదులు కూడా ఉంటారు. తమ చేతికి నెత్తుటి తడి అంటకుండా, శత్రువు చేతికి గుట్టుమట్లన్నీ అప్పగించేస్తారు. లేదా, అదను చూసి అధికార పీఠాన్ని లాగేసుకుంటారు.
పురాణాల్లో విభీషణుడు
పురాణాల్లో నమ్మక ద్రోహుల గురించి చెప్పుకోవాలంటే, ముందుగా విభీషణుడి సంగతి చెప్పుకోవాలి. సొంత అన్నకే ద్రోహం తలపెట్టాడు. రావణుడు సీతను అపహరించిన కారణంగానే రామ రావణ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రాముడి తరఫున వానరసేన, రావణుడి తరఫున రాక్షస సేన యుద్ధంలో బలాబలాలు తేల్చుకుంటే అదో లెక్క. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ‘గాలి’వాటం చూసుకుని పార్టీలు ఫిరాయించినట్లుగానే, సరిగా యుద్ధం మొదలవడానికి ముందు విభీషణుడు కూడా ఫిరాయించాడు. సీతను అపహరించడం రావణుడి తప్పే కావచ్చు. అయితే, యుద్ధంలో అతడి తరఫున పోరాడటం విభీషణుడి నైతిక ధర్మం. విభీషణుడు ఆ నైతిక ధర్మాన్ని విడిచిపెట్టి, రావణుడితో గొడవపడ్డాడు. యుద్ధానికి ముందు రాముడి పక్షాన చేరిపోయాడు.
అంతటితో ఆగకుండా, ఎక్కడ కొడితే రావణుడు కచ్చితంగా మరణిస్తాడో ఆ రహస్యాన్ని కూడా రాముడికి చెప్పేశాడు. చేతికి నెత్తుటితడి అంటకుండానే, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. రామ రావణ యుద్ధం ముగిశాక, రాముడి సమక్షంలో లంకకు రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు. విభీషణుడి నమ్మకద్రోహం రావణుడికి అనూహ్య పరిణామం. శౌర్యప్రతాపాలు పెద్దగా లేని విభీషణుడు శత్రువు పక్షాన చేరితే తనకేం నష్టమని రావణుడు నిర్లక్ష్యం చేశాడు. పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు, కొడుకు ఇంద్రజిత్తు వంటి వీరాధివీరులు తన వెంటే ఉండగా, కోతిమూకను వెంటేసుకు వచ్చిన రాముడు తననేం చేయగలడని దురహంకారంతో తేలికగా తీసుకున్నాడు. తమ్ముడైన విభీషణుడు తన గుట్టుమట్లన్నీ రాముడి చేతికిచ్చేస్తాడని ఏమాత్రం ఊహించలేకపోయాడు.
రోమన్ చరిత్రలో బ్రూటస్
ప్రాచీన చరిత్రలో రోమన్ రాజ్యంలోని బ్రూటస్‌కు మించిన నమ్మకద్రోహి మరెవరూ కనిపించరు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్కు నమ్మకమైన ఆంతరంగికుడిగా ఉండేవాడు. అంతటి ఆంతరంగికుడు వెన్నుపోటు పొడుస్తాడని ఎవరూ ఊహించలేరు. పాపం... వెన్నులో కత్తి దిగేంత వరకు సీజర్ కూడా ఊహించలేకపోయాడు. ‘నువ్వు కూడానా బ్రూటస్...’ అని ఆక్రోశంతో వాపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు.
జూలియస్ సీజర్ నియంతగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని సెనేటర్లు అతడిపై కుట్ర పన్నారు. సీజర్కు అత్యంత సన్నిహితుడుగా ఉండే బ్రూటస్ను తమతో కలుపుకుంటే తప్ప తమ కుట్రను అమలు చేయడం సాధ్యం కాదని తలచి, అతడిని తమతో కలుపుకున్నారు. సీజర్ సెనేట్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే అతడిపై విరుచుకుపడ్డారు. బ్రూటస్ నమ్మకద్రోహానికి సీజర్ దారుణంగా బలైపోయాడు.
మన చరిత్రలో మీర్ జాఫర్
మన దేశంలో పేరుమోసిన నమ్మకద్రోహుల జాబితాలో మీర్ జాఫర్‌ను తప్పక ప్రస్తావించుకోవాలి. ఇతగాడు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా వద్ద సేనానిగా ఉండేవాడు. సేనాని పదవి అతడికి తృప్తికరంగా ఉండేది కాదు. ఎలాగైనా, ఏనాటికైనా బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించాలనే అధికార కాంక్షతో రగిలిపోయేవాడు. ప్లాసి యుద్ధం అతగాడికి అయాచితంగా కలిసొచ్చింది.
రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని బ్రిటిష్ సేనలు 1757లో బెంగాల్‌పై యుద్ధానికి దిగాయి. నవాబు సిరాజుద్దౌలాను గద్దెదించి, బెంగాల్‌ను తమ అధికార పరిధిలోకి తెచ్చుకోవాలనేదే బ్రిటిష్‌వాళ్ల లక్ష్యం. అధికార కాంక్షతో రగిలిపోతున్న మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్లకు పావుగా మారాడు. సిరాజుద్దౌలాకు నమ్మకద్రోహం చేసి, బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపాడు. ఫలితంగా ప్లాసి యుద్ధంలో సిరా జుద్దౌలా బ్రిటిష్ సేనల చేతికి చిక్కి మరణశిక్షకు గురయ్యా డు. అతడి మరణం తర్వాత, బ్రిటిష్ వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా గద్దెనెక్కాడు. బెంగాల్‌ను ఏలిన చిట్టచివరి ‘స్వతంత్ర’పాలకుడు ఇతడే.
ద్రోహకాలం పట్ల తస్మాత్ జాగ్రత్త!
రాహుకాలంలో శుభకార్యాలు చేయరాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. నమ్మకం ఉన్నవాళ్లు పంచాంగం చూసుకుని, రాహుకాలాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. దాని ప్రకారం తమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. కానీ, మనుషులను నిట్టనిలువునా ముంచేసే ద్రోహకాలం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఏ పంచాంగమూ ముందుగా చెప్పలేదు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటే తప్ప ద్రోహకాలాన్ని పసిగట్టడం సాధ్యం కాదు. ఆధునిక కాలంలో వంచనాశిల్పం మరింత అధునాతంగా మారింది. నెత్తుటిచుక్కనైనా చిందించకుండానే గద్దెలను గద్దల్లా తన్నుకుపోయే ఆరితేరిన వంచనాశిల్పులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు.
అలాంటి వంచనాశిల్ప నిపుణులు మన దేశంలోను, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ‘వెన్నుపోటు’ అనే పదం వినిపించడమే తడవుగా ప్రజలకు చప్పున స్ఫురణకు వచ్చే స్థాయికి ఎదిగిపోయిన వీరులు వారు. అలాగని వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు వంటివి అధికారంలో ఉన్నవారికి మాత్రమే చేటు తెస్తాయనుకుంటే పొరపాటే! ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ఏ స్థాయి మనిషికి ఆ స్థాయి వెన్నుపోట్లు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వైవాహిక, ప్రణయ సంబంధాలలో కావచ్చు... సామాజిక, వైయక్తిక సంబంధాలలో వెన్నుపోట్లకు అతీతమైనవి ఏవీ లేవు. ఆదమరపు లేకుండా, అప్రమత్తంగా మెలగడం మినహా వీటి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గమూ లేదు.