మూర్ఛను గుర్తించేందుకు, పక్షవాత చికిత్సకూ మొబైల్ ఆప్స్!
న్యూయార్క్: మూర్ఛ వ్యాధి వల్ల వచ్చే సీజర్స్‌ను గుర్తించేందుకు, పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స చేసేందుకు ఉపయోగపడే రెండు వినూత్న మొబైల్ అప్లికేషన్లను బ్రిటన్‌లోని ‘బెల్ఫాస్ట్’కు చెందిన పరిశోధకులు రూపొందించారు. వీటిలో ‘ఎపిలెప్సీ ఆప్’తో వైద్య పరిజ్ఞానం లేనివారు సైతం ఒక వ్యక్తికి మూర్ఛవ్యాధి వల్ల సీజర్స్ (కంపించిపోతూ కూలిపోవడం) వస్తున్నాయా? లేదా వేరే కారణమా? అనేది గుర్తించవచ్చు. మూర్ఛవ్యాధి ఉన్నవారిలో నాడీవ్యవస్థ అసాధారణంగా స్పందించడం వల్ల ఒక్కసారిగా ప్రకంపనలతో బిగుసుకుపోయి కుప్పకూలుతుంటారు. ఇతర సమస్యల వల్లా సీజర్స్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి.. మూర్ఛ వల్లే ఆ సీజర్స్ వచ్చాయా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకే వైద్యులు అందుబాటులో లేనప్పుడు సీజర్స్‌ను గుర్తించేలా ఈ ఆప్‌ను రూపొందించారు.
మూర్ఛరోగులపై అధ్యయనం చేసి.. రూపొందించిన ఈ ఆప్‌ను భారత్, నేపాల్‌లో 132 మందిపై పరీక్షించగా.. 96 శాతం మందిలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. అలాగే మరో అప్లికేషన్ ‘స్ట్రోక్ ఆప్’ కూడా పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు, పర్యవేక్షించేందుకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆప్‌ను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వైద్యులు ఉపయోగిస్తున్నారు.