సిరియాకు ఐరాస ‘అగ్నిపరీక్ష’!
తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
మరోసారి అగ్ర రాజ్యాలు ‘రసాయనిక ఆయుధాల వినియోగం’ క్రీడకు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు ఈ ఆరోపణ ఎదుర్కొం టున్న దేశం సిరియా. పశ్చిమాసియాలోని ఈ సంక్షుభిత రాజ్యం ప్రస్తుతం అంతర్యుద్ధంతో సతమతవుతోంది. సైన్యం మద్దతుతో పోరాడుతున్న కుర్దిష్ సాయుధ బృందాలకీ; అల్ కాయిదా అండదండలు ఉన్న తిరుగుబాటుదారులకీ మధ్య సిరియా నైరుతి భాగంలో సంకుల సమరమే జరుగుతోంది.
అంతర్యుద్ధం అణచివేత పేరుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసాద్ మూడుచోట్ల రసాయనిక ఆయుధాలు ప్రయోగించాడని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆరోపిస్తున్నాయి. దీనితో నిజానిజా లు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి నియమిం చిన ఇరవై మంది సభ్యుల తనిఖీ బృందం ఈ నెల 18న సిరియా రాజధాని డమాస్కస్ చేరుకుంది. సమితి పంపిన తనిఖీ బృందానికి సిరియా పూర్తిగా సహకరిస్తుందని విదేశ వ్యవహారాల మంత్రి ఫైయాసల్ మెక్దాద్ ముందే చెప్పారు. అలెప్పో అనే పట్టణం ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు.
సిరియా అంతర్యుద్ధం కరవు కాటకాల నుంచి పుట్టిందనిపిస్తుంది. అలెప్పోకు సమీపంగా ఉన్న దారా అనే గ్రామంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత రెండున్నరేళ్లలో అంతర్యుద్ధం రూపం తీసుకుంది. ఆ దుర్భిక్షం సమయంలో ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థు లు గోడల మీద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు. దీనితో ప్రభుత్వం చాలా కఠినంగా స్పందించింది. ఆ విద్యార్థులను అరెస్టు చేసి దారుణమైన హింసకు గురిచేసింది. ఇది 21వ శతాబ్దంలోనే రక్తపంకిల ఘటనగా పేరు మోసింది. నిజానికి పిల్లలు రాసిన నినాదాలు సత్యదూరాలు కావు. 2001 నుంచి ఆ ప్రాంతమంతా కరవు తాండవిస్తున్నది. 2009లో ఐక్య రాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి చేసిన అధ్యయనం ప్రకారం ఎనిమిది లక్షల మంది రైతులు పొలాలకు దూరమయ్యారు.
తనిఖీ బృందం పరిధి పెద్దది కాదు. కేవ లం మూడుచోట్ల తనిఖీతో దాని బాధ్యత పూర్తయిపోతుంది. ఇందులో ఈ సంవత్సరం మార్చి 19న ఖాన్ అల్ అస్సాల్ దగ్గర జరిగిన దాడి ఒకటి. అయితే ఆ దాడి ‘ఇస్లామిస్ట్’ తిరుగబాటుదారులదే తప్ప తమది కాదని అధ్యక్షుడు అసాద్ ఆరోపిస్తున్నారు. మిగిలిన తని ఖీలు ఎక్కడ జరుగుతాయో మాత్రం రహస్యంగా ఉంచారు. సిరియా ప్రభుత్వం అలెప్పో దగ్గర రెండు పర్యాయాలు నాడీ మండల వ్యవస్థను దెబ్బతీసే సారిన్ అనే రసాయనాన్ని ఉపయోగించిందని మొన్న జూన్‌లో అమెరికా ఆరోపించింది.
అలెప్పో దగ్గరలోనే ఉన్న షేక్ మక్సూద్ దగ్గర ఏప్రిల్ 13న, కుసార్ అబూ సమారా అనే చోట మే నెల 14న రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిగిందని అగ్రరాజ్యం ఆరోపణ. మే నెల 23న అద్రా పట్ణణం దగ్గర కూడా ఇలాంటి దాడి జరిగిందని అమెరికా రాయబారి సమితికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలెప్పో, హామ్స్, డెమాస్కస్లలో ఈదాడులు జరిగాయని మార్చి 25న ఫ్రాన్స్, బ్రిటన్లుసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్‌కు ఫిర్యాదు చేశాయి. వాటి ఫలితమే సిరియాకు రసాయనిక ఆయుధాల తనిఖీ బృందం రాక. ఆ ఆయుధాలు ప్రయోగించిన ప్రదేశాల నుంచి తీసుకున్న మట్టి నమూనాలు, ప్రజల నుంచి తీసుకున్న ఇంటర్వ్యూల పరిశీలన ఇప్పటికే పూర్తయినాయి.
ప్రస్తుతం అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్న నైరుతి ప్రాంతం చమురు వనరులు విస్తృతంగా ఉన్నదే. 2011 నుంచి జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకు లక్షకు పైగా జనం మరణించారు. ఈ ఘర్షణ ఇప్పటితో ఆగేది కాదన్న భయాందోళనలు కూడా ప్రజ లలో బలపడినట్టు కనిపిస్తున్నాయి. కొద్దికాలంగా దేశం విడిచి ఇరాక్‌కు ఉత్తరంగా ఉన్న ఐక్యరాజ్యసమితి శిబిరాలకు వెళ్లిన వారి సం ఖ్య పందొమ్మిది లక్షలు. ఈ కొద్దిరోజులలోనే 30 వేల మంది సిరియన్లు, ముఖ్యంగా కుర్దిష్‌లు వె ళ్లిపోయారు. దేశంలో పోరాడుతున్న తిరుగుబాటుదారులకు కొన్ని విదేశశక్తులు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని, ఇది ఇకపై సాగదని సిరియా ప్రధాని నూరి అల్ మాలిక్ హెచ్చరించడం గమనించవచ్చు.
చిత్రంగా, సిరియా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తిరుగుబాటు శక్తులను ఆదుకోవాలన్న ఆలోచన అమెరికాకు వచ్చిం దని జూన్‌లో ఒబామా ప్రకటించడం ఈ ఉదంతం మొత్తానికి కొసమెరుపు. అఫ్ఘానిస్థా న్లో పాకిస్థాన్‌లో అల్ కాయిదాతో పోరాడుతున్న అమెరికా, సిరియాలో అల్‌కాయిదా మద్దతుదారులకు సాయం చేయడానికి నిర్ణయించిందన్నమాట. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉండగానే అకె సెల్‌స్ట్రామ్ (స్వీడన్ రసాయనిక ఆయుధాల నిపుణుడు)నాయకత్వంలోని సమితి తనిఖీ బృందం తన పని సాగించవలసి ఉంది. ఇదికూడా చిత్రంగానే అనిపిస్తుంది. గతంలో ఇరాక్ వ్యవహారంలో తనిఖీ బందానికి ఎదురైన ప్రతిఘటన, ఎదురుదాడి సిరియా నుంచి ఎదురుకాలేదు.కానీ తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ఇలాంటి ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టం గానే కనిపిస్తున్నాయి.
డా॥గోపరాజు నారాయణరావు