fake gold biscuits
-
బంగారం పేరుతో టోకరా
మనోహరాబాద్(తూప్రాన్): జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం కడ్డీలు దొరికాయని తక్కువ ధరకు అమ్ముతానని నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని, కాళ్ళకల్‌కు రప్పించి చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన వైనం మనోహరాబాద్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ నర్సింగ్‌రావుకు రిసాల్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఫోన్ చేసి మాది హర్యానా రాష్ట్రం అని, జేసీబీ డ్రైవింగ్ చేస్తానని డ్రైవర్ జాబ్ కావాలని అడిగాడు, కాగా నర్సింగ్‌రావు వద్ద జేసీబీ లేదని తెలిపాడు. కానీ రెండు నెలలుగా ఫోన్ చేస్తూ ఎక్కడైనా సరే డ్రైవర్‌గా పెట్టించమని అడిగాడు. నెల క్రితం అలాగే ఫోన్ చేసి నాకు ఓ పాత ఇంటిలో జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం బిస్కెట్స్ దొరికాయని, నాకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమని, వీటిని అమ్ముతానని బంగారం ఫొటోలను నర్సింగ్‌రావు ఫోన్‌కు పంపించాడు. దీన్ని నమ్మి విడతల వారిగా ఆన్లైన్లో రూ.లక్షా 28 వేలు పంపాడు. కాగా ఇంకా డబ్బులు కావాలని ఫోన్ చేయడంతో, అనుమానం వచ్చి మిగతా డబ్బులు బంగారం చూపితేనే ఇస్తానని చెప్పి అతడిని చాకచక్యంగా కాళ్ళకల్ గ్రామంలో బంగారమ్మ దేవాలయం వద్దకు రప్పించాడు. నర్సింగ్‌రావుకు బంగారం బిస్కెట్స్ మాదిరి బిల్లలు ఇవ్వగా అనుమానం వచ్చి వాటిని చెక్ చేయించగా అది బంగారం కాదని నకిలీదని తెలింది. వెంటనే అతడిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించినట్టు ఎస్ఐ రాజు తెలిపారు. అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ చేసి అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నకిలీ బంగారం విక్రయించే ముఠా గుట్టు రట్టు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నకిలీ బంగారం, వజ్రాలు విక్రయించే ముఠా గుట్టును శుక్రవారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 134 నకిలీ బంగారం బిస్కెట్లు, 57 నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చౌకగా బంగారమని ఎర!
నకిలీ బంగారంతో మోసం చేస్తున్న రాజస్థానీ బృందాలు సాక్షి, హైదరాబాద్ : కుర్తా...దోతీ ధరించి, తలపై పాగా పెట్టుకొని... రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకొని కొందరు కేటుగాళ్లు... వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా బంగారం అంటూ నకిలీ బంగారం అంటగట్టి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నారు. ‘భారీ మొత్తంలో మా పొలాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయి...వాటిని మా రాష్ట్రంలో అమ్మితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడకు వచ్చాం. మీకు అసలు ధర కంటే తక్కువగా ఇస్తాం. ఏ పన్ను చెల్లించకుండానే పసిడి మీ సొంతమవుతుంది... భారీగా లాభాలు ఆర్జించవచ్చు ’అని ఈ గ్యాంగ్ సభ్యులు నమ్మబలుకుతుంది. అనంతరం అసలు బంగారం బిస్కెట్ ముక్కలను శాంపిల్‌గా ఇచ్చి అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. వారిచ్చిన బంగారం ముక్కలను పరీక్షించుకుంటే వంద శాతం ఫర్ఫెక్ట్ పసిడేనని తేలుతుంది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు 40 శాతం తక్కువ ధరగా బంగారం ఇస్తామని చెబుతారు. ఉదహరణకు 750 గ్రాముల బంగారు బిస్కెట్కు బహిరంగ మార్కెట్లో రూ. 25 లక్షలు ఉంటే వీళ్లు రూ. 15 లక్షలకు బేరానికి పెడతారు. ఒకసారి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించని వారు కాస్త సమయం తీసుకొని డబ్బు సర్దుతారు. అప్పుడే ఈ గ్యాంగ్ అంతకు ముందు శాంపిల్ బిస్కెట్ కట్‌చేసిన మాదిరిగానే ఇప్పుడు నకిలీ బిస్కెట్లను కట్‌చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోమంటుంది. అయితే, అంతకు ముందే కదా పరీక్ష చేయించుకున్నాం.. మళ్లీ ఎందుకులే అని కొందరు ఆ బంగారం ముక్కలను పరీక్షించుకోకుండా డబ్బు చెల్లించి బంగారు బిస్కెట్లను తీసుకుంటున్నారు. తర్వాత అవి నకిలీ బిస్కెట్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మేవాడ్ వాళ్లే ఎక్కువ... ఈ దొంగల ముఠాలో రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఎక్కువగా ఫలక్‌నుమా ప్యాలెస్ సమీప ప్రాంతాలు, గోల్కొండలోని ఫతే దర్వాజా వద్ద చక్కర్లు కొడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వీరు దందా కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లింలతో కలిసిపోయినట్టుగా నటిస్తారు. వీరు చూసేందుకు అమాయకంగా కనబడుతున్నా పదుల సంఖ్యలో ముఠాలుగా ఏర్పడి ప్రజలను బంగారం బిస్కెట్ల ఆశ చూపి మోసం చేస్తున్నారు. కొందరిని మోసం చేశాక ఒక్కో గ్రూప్ నుంచి సభ్యులు మరో ముఠాలోకి మారుతుంటారు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా బంగారం పేరుతో కాసులు కొల్లగొడుతున్నారు. సీపీ చొరవతో... ఫలక్‌నుమాకు చెందిన ఓ వ్యాపారి రాజస్థానీ గ్యాంగ్ చేతిలో మోసపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మూడేళ్లు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సదరు ముఠాలను సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇతనొక్కడే కాదు...ఇలా మోసపోయినవారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది.