అమ్మాయిలతో నకిలీ నోట్ల చలామణి
మెహిదీపట్నం: టైలరింగ్ షాపు పెట్టి నకిలీ నోట్ల చలామణికి శ్రీకారం చుట్టాడో ప్రబుద్ధుడు. అధిక కమిషన్ ఆశచూపి తన వద్ద పనిచేసే అమ్మాయిలనే ఏజెంట్లుగా పెట్టుకొని కథ నడిపిస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో పాటు ముగ్గురు యువతులను కటకటాల్లోకి నెట్టారు.
శుక్రవారం మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్ ఏసీపీ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, ఏసీపీ గౌస్‌మొయినుద్దీన్, టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ రవీందర్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ (42) అదే ప్రాంతంలోని ప్రశాంతి టవర్స్‌లో లలితా ఎంటర్ప్రైజెస్ పేరిట టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.
ఇతను అనంతరంపురం జిల్లాకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి(36) వద్ద నుంచి రూ.1.24 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నాడు. తన షాపులో టైలరింగ్ పనిచేసే ఈ. అనిత (24), కె.సరిత(24), జి.హరిక(22)లకు ఎక్కువ కమిషన్ ఇస్తానని ఆశపెట్టి వారితో గత కొంతకాలంగా చలామణి చేయిస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేస్తూ వారు వెయ్యి, ఐదు వందల నకిలీ నోట్లను గుట్టుచప్పుడు కాకుండా మార్పిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా... గురువారం ఆసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతంలో లక్ష్మీనారాయణ బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా టప్పాచబుత్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. తనిఖీ చేయగా అతడి వద్ద రూ.36 వేల నకిలీ నోట్లు బయపడ్డాయి.
దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురు అమ్మాయిలతో కలిసి నకిలీ నోట్లు మార్పిడి చేయిస్తున్నట్టు వెల్లడించాడు. తనకు అనంతపురానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి నకిలీ నోట్లు అందిస్తున్నట్ల లక్ష్మీనారాయణ విచారణలో వెల్లడించాడు. శ్రీనాథ్‌రెడ్డిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నకిలీ నోట్లతో పాటు ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టప్పాచబుత్ర డీఎస్ఐ నాగరాజు, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు.