ఇంటద్దె క్లెయిమ్‌లో జాగ్రత్త!
ఉద్యోగస్తులు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించడం.. ఆ మేరకు రశీదులు ఇవ్వడం... ఆ ఇవ్వడం కూడా కేవలం తన యాజమాన్యానికి ఇవ్వటం... యాజమాన్యం ఎలాంటి తనిఖీ లేకుండా తన సొరుగులో పెట్టేసుకోవటం... ఇంటద్దె క్లెయిమ్‌ను అనుమతించటం... ఆ మేరకు ఆదాయం తగ్గింపు... పన్ను భారం తగ్గింపు... ఇదంతా ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రహసనం. మనలో మన మాట!! వీటిల్లో ఎన్నెన్నో దొంగ క్లెయిమ్‌లు కూడా ఉంటున్నాయి. అవి...
1. తక్కువ అద్దె ఇచ్చి.. ఎక్కువ మొత్తానికి రశీదు అందజేయటం
2. అసలు ఏ మాత్రం అద్దె చెల్లించకుండా రశీదు సమర్పించటం
3. సొంత ఇంట్లోనే ఉంటూ అద్దె ఇంట్లో ఉన్నట్లు రశీదు ఇవ్వటం
4. తండ్రి లేదా తల్లి ఇంట్లోనో ఉంటూ అద్దె ఇచ్చినట్లు చూపించడం
5. భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ.. ఇద్దరూ రెండు అద్దె రశీదులివ్వటం
6. నకిలీ ఓనర్... లేని ఓనర్ పాత్రను సృష్టించి అద్దె రశీదు ఇవ్వడం.
7. ఏదో ఒక డమ్మీ ఇంటి నంబరుతో రశీదు ఇవ్వడం వంటివి.
కంపెనీల యాజమాన్యాలు ఈ క్లెయిమ్‌లను సరిగ్గా వెరిఫై చేయకుండా ఊరుకుంటున్నాయి. సహవాసం వల్లనో, అరకొర సిబ్బంది వల్లనో ఏ కారణం వల్లనో ఇచ్చిన వివరాలు చెక్ చేయటం... ఇచ్చిన రశీదుల్లో నిజమెంత అని గానీ .. పేరు కానీ, ఇంటి నంబరు కానీ, అద్దె మొత్తం గానీ చెక్ చేయడం లేదు. గుడ్డిగా రశీదులు తీసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఇటువంటి వాటిమీద నిఘా పెడుతోంది ఐటీ డిపార్ట్మెంటు. అంతే కాకుండా ఈ మధ్య వెలువడిన జడ్జిమెంట్‌లో సారాంశం ఏమిటంటే... అధికారులు హెచ్ఆర్ఏ విషయంలో చెక్ చేయాలని, క్లెయిమ్ నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలని, నిజం కాకపోతే నోటీసులు, ట్యాక్సులు, వడ్డీలు.. పెనాల్టీలు మొదలైన రూపాల్లో వడ్డన ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు...
అద్దె ఇంట్లోనే ఉంటుంటే ముందుగా అగ్రిమెంటు రాసుకోండి
చెక్కు, డీడీ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా అద్దె చెల్లించండి.
అద్దె కాకుండా చెల్లించే కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు మొదలైనవి బ్యాంకు ద్వారా చెల్లించండి.
తప్పనిసరి పరిస్థితుల్లో నగదు చెల్లిస్తే రూ.1 రెవెన్యూ స్టాంపు అతికించండి.
మీరు చెల్లించే అద్దె నెలకి రూ.5,000 దాటితే టీడీఎస్ చేసి, రికవరీ చేసి ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో చెల్లించాలి.
వ్యవహారానికి సంబంధించి అన్ని కాగితాలు, పే స్లిప్పులు, బ్యాంకు ఖాతాలు, రశీదులు మొదలైనవి భద్రపర్చుకోండి.
ఓనర్ పాన్‌కార్డ్ జిరాక్స్ తీసుకోండి.
ఇంటి మున్సిపల్ ట్యాక్స్ రశీదులో ఉన్న పేరున్న వ్యక్తి నుంచే రశీదు పొందాలి.
ఓనర్షిప్ మారితే సేల్ డీడ్గానీ తీసుకోండి.
చాలా మంది దొంగ రశీదులు ఇస్తున్నారు. వ్యవహారం నిజమే కావొచ్చు.. అంటే ఇల్లు, ఇంటద్దె, చెల్లింపు అన్నీ కరెక్టే కావొచ్చు.. కానీ ఓనరు పన్ను భారాన్ని తగ్గించడానికి, బదిలీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తగిన జాగ్రత్త వహించండి.
మీరు నిజంగానే అద్దె చెల్లిస్తూ మీ తల్లిదండ్రుల ఇంట్లోనైనా ఉండొచ్చు. కానీ అద్దె చెల్లించండి. దాన్ని అటు మీ తల్లిదండ్రుల ఇన్కమ్ ట్యాక్స్‌లో ఆదాయం కింద చూపించండి.
భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూ.. ఒకరే అద్దె చెల్లిస్తూ, ఇద్దరూ క్లెయిమ్ చేయకండి.
ఒకే ఇంట్లో ఉంటూ.. మీరు వేరు వేరు దొంగ ఇంటి నంబర్లు ఇచ్చి మినహాయింపు పొందే ప్రయత్నం చేయొద్దు.