fake pass book
-
అడ్డగోలు దందా!
►అక్రమాలకు అడ్డాగా స్థానిక సంస్థలు ►శివారులో వందల్లో అనధికార లేఅవుట్లు ►అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సిబ్బంది ►ఎడాపెడా జారీ అవుతున్న అనుమతులు ►నకిలీ రసీదులు, ఫోర్జరీ సంతకాలతో లీలలు ►నకిలీ పాస్ బుక్కులతోనూ బోగస్ పర్మిషన్లు ►తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. పలు శివారు పంచాయతీల్లో నిబంధనలకు నీళ్లొదులుతూ పాలక వర్గాలు, అధికారులు భారీగా జేబులు నింపుకుంటున్నారు. రాజధానికి సమీపపల్లెల్లో శరవేగంగా జరుగుతున్న నగరీకరణనేపథ్యంలో పంచాయతీ కార్యాలయాలు అడ్డగోలు వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నా పంచాయతీల పాలకవర్గాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. అవి అక్రమమని తెలిసినా.. వాటిలో ఎడాపెడా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ భారీగా దండుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ముకుతాడు వేయాల్సిన క్షేత్రస్థాయి యంత్రాంగం కూడా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా నిలవాల్సిన పంచాయతీలు అవినీతికి అలవాలంగా మారుతున్నాయి. ఇవిగో అక్రమాలకు సాక్ష్యాలు.. ఇటీవల జిల్లాలో జరుగుతున్న అక్రమాల పరంపరను గమనిస్తే స్థానిక సంస్థల్లో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ రసీదులతో నిధులు స్వాహా, ఫోర్జరీ సంతకాలతో బోగస్ గృహ నిర్మాణ అనుమతులు జారీ చేసిన బాగోతాలు ఇటీవల అధికారుల విచారణలో వెల్లడయ్యాయి. గండిపేట మండలంలో ఏకంగా ఓ కార్యదర్శి నకిలీ పుస్తకాలతో మూడు పంచాయతీల్లో బోగస్ అనుమతులు మంజూరు చేసి ఖజానాకు గండికొట్టారు. నిధులు కైంకర్యం చేసిన హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ సర్పంచ్‌పై వేటు పడగా.. తాజాగా అనధికార లేఅవుట్లలో బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చిన శంకర్పల్లి మండల కార్యదర్శి దామోదర్‌రెడ్డి, మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామ కార్యదర్శి రమేశ్‌కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లలో అనుమతులు ఇవ్వడంపై సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కొత్తూరు మండల కేంద్రానికి చెందిన సర్పంచ్‌కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. అనధికార లేఅవుట్లలో నిర్మాణ అనుమతులు ఇవ్వడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగం మోపిన యంత్రాంగం.. ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని శ్రీముఖం పంపింది. కాగా, పలు పంచాయతీల్లో నకిలీ బిల్లులతో ఆస్తిపన్ను, నల్లా బిల్లులను స్వాహా చేసినట్లు గుర్తించిన యంత్రాంగం అంతర్గత విచారణలు సాగిస్తోంది. అలాగే గండిపేట మండల పరిధిలోని 8 గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలను నిశితంగా గమనిస్తోంది. ఆయా కట్టడాలకు అనుమతులున్నాయా? లేదా అనే కోణంలో పరిశీలిస్తోంది. తద్వారా స్థానిక సంస్థల్లో జరుగుతున్న అక్రమాల్లో కొంతమేరైనా తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. -
యథేచ్ఛగా నకిలీ దందా
► అక్రమార్కులకు హౌసింగ్ ఏఈ అండ ? ► తవ్వేకొద్ది బయట పడుతున్న నకిలీ పట్టాలు ► ‘సాక్షి’ కథనంతో ముందుకు వస్తున్న బాధితులు ► వైఎస్సార్‌నగర్‌లో ఇదీ పరిస్థితి నెల్లూరు రూరల్ : తీగలాగితే డొంక కదిలినట్లు వైఎస్సార్ నగర్‌ను ఆక్రమించుకుని నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరి వెనుక హౌ సింగ్ శాఖకు చెందిన ఏఈ అండ కూడా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గురువారం సాక్షి పత్రి కలో వైఎస్సార్‌నగర్‌లో రౌడీరాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. దీంతో శివ, మంజు అనే అక్రమార్కుల బారినపడి దెబ్బలు తిన్న బాధితులెందరో ముందుకు వచ్చి అక్కడ నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతున్న వైనం గురించి ‘సాక్షి’కి తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాలు వైఎస్సార్‌నగర్‌లో ప్రభుత్వం పదేళ్ల క్రిందల 6,465 ఇళ్లను మంజూరు చేసింది. కాలనీ పరిస్థితులు నివసించేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఏడాది క్రితం వరకు ఇళ్లల్లో ఎవరూ చేరలేదు. తరువాత జిల్లా అధికారులు కాలనీ అభివృద్ధికి నిధులను విడుదల చేయడంతో లబ్ధిదారులు ఒక్కొక్కరిగా ఇళ్లల్లో చేరసాగారు. ఇదే అదునుగా భావించిన కొంత మంది ముఠాగా ఏర్పడి ఏకంగా హౌసింగ్ అధి కారుల సంతకాలను ఫోర్జరీ చేసి(స్కాన్), ఇంటికి అసలు పట్టాలు ఉండగానే నకిలీ పట్టాలు సృష్టించి అమ్మసాగారు. ఈ విధంగా అక్రమార్కులు రాత్రికి రాత్రే బడా ధనవంతులుగా మారారు. ఇందుకు స్థానికంగా ఆ కాలనీని పర్యవేక్షిస్తున్న సంబంధిత ఏఈ సహకారం కూడా అందించారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలను కొనుగోలు చేసి మోసపోయిన వారిలో కొన్ని ఉదాహరణలు ß 1350 ప్లాట్ నంబర్ నిజమైన లబ్ధిదారిణీ పుష్ప పేరుమీద పట్టా మంజూరై ఉంది. అయితే ఈ ప్లాట్‌కి నకిలీ పట్టా సృష్టించి లక్ష రూపాయలకు కీలా నాగరాజుకు అమ్మేశారు. తెలియక కొనుగోలు చేసి తీవ్రంగా మదన పడుతున్నారు. ß 1349 ప్లాటు యరవ విజయలక్ష్మి పేరుపై ఉంది. దీనికి కూడా నకిలీ సృష్టించి కె.భూపతికి రూ.80 వేలకు అమ్మేశారు. కొనుగోలు చేసింది నకిలీ పట్టా అని తేలడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు ß 2017 ప్లాట్ నంబర్ లలిత పేరుతో ఉంది. దీనిని ఆక్రమించుకుని అక్రమార్కుడు నివాసం ఉంటున్నాడు. నకిలీపై నిలదీయడంతో దాడి చేశారు నేను నిరుపేదరాలను. బాలాజీనగర్‌లో ఇళ్లలో కూలి చేసి అర్ధాకలితో దాచిపెట్టుకున్న డబ్బులతో వైఎస్సార్‌నగర్‌లో తక్కువకు వస్తుందనే ఆశతో ఇల్లు కొనుగోలు చేశాను. శివ అనే వ్యక్తి నకిలీ పట్టా నాపేరుతో ఇచ్చి డబ్బులు రూ.80 వేలు తీసుకున్నాడు. తీరా నకిలీ అని తేలడంతో ఇదేమి పని అని నిలదీయగా బూతులు తిడుతూ నాపై దాడి చేశారు. – వల్లం ఉమామహేశ్వరి, బాలాజీనగర్ అక్రమార్కులపై ఉక్కుపాదం వైఎస్సార్‌నగర్‌లో శివ, మంజు లాంటి కొంత మంది లబ్ధిదారులు కాని వారు అక్రమంగా నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మకాలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. నకిలీ పట్టాలను పరిశీలించగా అధికారుల సంతకాలను స్కాన్‌చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాం. లబ్ధిదారులకు అన్యాయం చేసిన వారి వివరాలను సేకరిస్తున్నాం. పీడీ రామచంద్రారెడ్డి సహకారంతో ఇల్లిళ్లూ తిరిగి విచారణ చేస్తాం. నకిలీ పట్టాలు అమ్మడమే కాక లబ్ధిదారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు చేపడతాం. –రాజారత్నం, హౌసింగ్ డీఈఈ -
నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోటి స్వాహా
గొలుగొండ, న్యూస్‌లైన్: నకిలీ పాసు పుస్తకాలతో రూ.లక్షలు స్వాహా చేశారు. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి జేబులు నింపుకున్నారు. వంద వంకలు చూపి ఎకరా భూమికి రూ. వెయ్యి రుణమివ్వని అధికారులు నకిలీ పాసు పుస్తకాలపై పలువురికి రూ. లక్షలు చొప్పున రుణాలిచ్చేశారు. రూ.కోటి వరకు అవినీతి జరిగిందని అంచనా. నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల మండలాల్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. వాసిరెడ్డి మాసయ్యనాయుడుకు సెంటు భూమి లేకపోయినా నకిలీ పాసు పుస్తకాలతో నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకులో రూ.లక్ష మంజూరైంది. కిల్లాడ నానాజీకి భూమి లేకపోయినా రూ.లక్ష రుణమిచ్చారు. అల్లు అప్పలనాయుడు, పైల వరహాలబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడుల కు గొలుగొండ మండలంలో భూములు లేవు. వీరి పేరున ఐదు నుంచి పదెకరాలు ఉన్నట్టు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకులో రుణాలు పొందారు. రాయపురెడ్డి లక్ష్మి, గంగునాయుడు, పైల సన్యాసమ్మ నర్సీపట్నం యూనియన్ బ్యాంకులో రూ.62 నుంచి రూ.92 వేల వరకు రుణాలు తీసుకున్నారు. సూత్రధారులెవరు? గొలుగొండ మండలం కొత్తపాలేనికి చెందిన పైల బాబూరావు, నర్సీపట్నం మండలం బలిఘట్టానికి చెందిన అప్పలనాయుడు, కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన సూరిబాబులు ఈ అవినీతి వ్యవహారానికి కారకులన్న వాదన వ్యక్తమవుతోంది. అసలు తమకేమీ తెలియదని, ఈ ముగ్గురూ తాము సంతకాలు పెడితే చాలని, ఎంతోకొంత ముట్టచెబుతామన్నారని పలువురు తెలిపారు. నకిలీ పాసు పుస్తకాల తయారీలో గొలుగొండ తహశీల్దార్ కార్యాలయంలోని దిగువ స్థాయి అధికారులు, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి హస్తం ఉన్నట్టు తెలిసింది. వ్యవసాయం రుణం పొందాలంటే పాసు పుస్తకాలు, అడంగల్ తప్పనిసరి. అడంగల్ కంప్యూటరీకరణ అనంతరం రుణాలు పొందడం రైతులకు కష్టతరమవుతోంది . అయినప్పటికి 2010-11 నుంచి వరుసగా మూడేళ్లపాటు నకిలీ డాక్యుమెంట్లతో భారీగా రుణాలు ఎలా మంజూరయ్యాయన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు మండలాల్లో గొలుగొండ ఎస్బీఐ, నర్సీపట్నం ఆధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకుల పరిధిలో సుమారు రూ.కోటి వరకు నకిలీ పాసు పుస్తకాలపై అవినీతి జరిగినట్టు చెబుతున్నారు. రాయపురెడ్డి రాంబాబు పేరున గొలుగొండ మండలంలో ఎకరా 20 సెంట్ల భూమి మాత్రమే ఉండగా ఏడెకరాల 26 సెంట్ల భూమి ఉన్నట్టు తప్పుడు రికార్డులు సృష్టిం నర్సీపట్నంలోని ఓ బ్యాంకులో రుణం పొందినట్టు తెలిసింది. వారికెవ్వరికీ భూములు లేవు: తహశీల్దార్ ఈ వ్యవహారంపై గొలుగొండ తహశీల్దార్ సుందరరావును వివరణ కోరగా మండలంలో వీరికి భూములే లేవని స్పష్టం చేశారు. నకిలీ పాసుస్తకాలపై యూనియన్ బ్యాంకు అధికారులను సంప్రదించగా వివరాలు వెల్లడించలేదు. ఆంధ్రా బ్యాంకు మేనేజర్ రాజును సంప్రదించగా కిల్లాడ నానాజీ, పైల వరహాలబాబు, అల్లు అప్పలనాయుడు, భీమిరెడ్డి అప్పలనాయుడుల పేరున రూ.లక్ష చొప్పున రుణాలిచ్చామని చెప్పారు. రుణాలు వెంటనే చెల్లించాలని కోరినప్పుడు పాసు పుస్తకాలు నకిలీవిగా గుర్తించామన్నారు. వెంటనే వారిని పిలిచి రుణాలు చెల్లించని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించామని తెలిపారు. దీంతో వీరు ఈ నెల 15లోగా రుణాలు చెల్లిస్తామని, అంతవరకు విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరినట్టు తెలిసింది.