అడ్డగోలు దందా!
►అక్రమాలకు అడ్డాగా స్థానిక సంస్థలు
►శివారులో వందల్లో అనధికార లేఅవుట్లు
►అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సిబ్బంది
►ఎడాపెడా జారీ అవుతున్న అనుమతులు
►నకిలీ రసీదులు, ఫోర్జరీ సంతకాలతో లీలలు
►నకిలీ పాస్ బుక్కులతోనూ బోగస్ పర్మిషన్లు
►తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. పలు శివారు పంచాయతీల్లో నిబంధనలకు నీళ్లొదులుతూ పాలక వర్గాలు, అధికారులు భారీగా జేబులు నింపుకుంటున్నారు. రాజధానికి సమీపపల్లెల్లో శరవేగంగా జరుగుతున్న నగరీకరణనేపథ్యంలో పంచాయతీ కార్యాలయాలు అడ్డగోలు వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నా పంచాయతీల పాలకవర్గాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. అవి అక్రమమని
తెలిసినా.. వాటిలో ఎడాపెడా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ భారీగా దండుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ముకుతాడు వేయాల్సిన క్షేత్రస్థాయి యంత్రాంగం కూడా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా నిలవాల్సిన పంచాయతీలు అవినీతికి అలవాలంగా మారుతున్నాయి.
ఇవిగో అక్రమాలకు సాక్ష్యాలు..
ఇటీవల జిల్లాలో జరుగుతున్న అక్రమాల పరంపరను గమనిస్తే స్థానిక సంస్థల్లో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ రసీదులతో నిధులు స్వాహా, ఫోర్జరీ సంతకాలతో బోగస్ గృహ నిర్మాణ అనుమతులు జారీ చేసిన బాగోతాలు ఇటీవల అధికారుల విచారణలో వెల్లడయ్యాయి. గండిపేట మండలంలో ఏకంగా ఓ కార్యదర్శి నకిలీ పుస్తకాలతో మూడు పంచాయతీల్లో బోగస్ అనుమతులు మంజూరు చేసి ఖజానాకు గండికొట్టారు. నిధులు కైంకర్యం చేసిన హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ సర్పంచ్‌పై వేటు పడగా.. తాజాగా అనధికార లేఅవుట్లలో బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చిన శంకర్‌పల్లి మండల కార్యదర్శి దామోదర్‌రెడ్డి, మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామ కార్యదర్శి రమేశ్‌కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లలో అనుమతులు ఇవ్వడంపై సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేసింది.
అలాగే కొత్తూరు మండల కేంద్రానికి చెందిన సర్పంచ్‌కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. అనధికార లేఅవుట్లలో నిర్మాణ అనుమతులు ఇవ్వడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగం మోపిన యంత్రాంగం.. ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని శ్రీముఖం పంపింది. కాగా, పలు పంచాయతీల్లో నకిలీ బిల్లులతో ఆస్తిపన్ను, నల్లా బిల్లులను స్వాహా చేసినట్లు గుర్తించిన యంత్రాంగం అంతర్గత విచారణలు సాగిస్తోంది. అలాగే గండిపేట మండల పరిధిలోని 8 గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలను నిశితంగా గమనిస్తోంది. ఆయా కట్టడాలకు అనుమతులున్నాయా? లేదా అనే కోణంలో పరిశీలిస్తోంది. తద్వారా స్థానిక సంస్థల్లో జరుగుతున్న అక్రమాల్లో కొంతమేరైనా తగ్గించవచ్చని అంచనా వేస్తోంది.