వెలుగు చూస్తున్న కైలాస్‌ నాయక్‌ లీలలు.. | Kailash Nayak Irregularities With Support Of TDP Leader | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల ‘కైలాస్‌’

Published Thu, Sep 24 2020 11:58 AM | Last Updated on Thu, Sep 24 2020 12:07 PM

Kailash Nayak Irregularities With Support Of TDP Leader - Sakshi

ఆర్‌.కైలాష్‌ నాయక్‌

కర్నూలు రూరల్‌: జిల్లాకు చెందిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాష్‌నాయక్‌ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. కుల సంఘం మాటున నేతగా ఎదిగిన ఇతను సొంత కులం వారినే వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గతంలో పేదల స్థలాలు కబ్జాలు చేయడమే కాకుండా బాధితులను ఊరు విడిపించిన ఉదంతాలూ ఉన్నాయి. కైలాష్‌నాయక్‌  కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. ఆయన అండతో మొన్నటి వరకు చిన్న చిన్న దందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఇతను ఇప్పుడు భారీ వసూళ్లకు తెరతీశాడు. కర్నూలు మండలం సుగాలి తండాలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి.

వీరికి 1975లో కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద కుటుంబానికి ఐదెకరాల చొప్పున అప్పటి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. సర్వే నంబర్‌ 507ఏలోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు గాను ఎకరానికి రూ.18 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇదే సర్వే నంబర్‌లో కైలాష్‌ నాయక్‌కు కూడా ఐదెకరాల పొలం ఉంది. అయితే.. అందరికీ నష్టపరిహారం డబ్బు తానే తెప్పించానంటూ అక్రమ వసూళ్లకు తెర తీశాడు. ప్రతి ఒక్కరూ ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. ఇలా ఇప్పటికే రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా డబ్బు అందని వారి నుంచి ప్రాంసరీ నోటు కూడా రాయించుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన బాధితులను చంపేస్తానంటూ రివ్వాలర్‌తో బెదిరించాడు. దీంతో మూడు రోజుల క్రితం కైలాష్‌నాయక్‌పై బాధితులు కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

టీడీపీ నేత అండతో.. 
టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అండతో కైలాస్‌ నాయక్‌ దందాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి తండా, నందనపల్లి పంచాయతీలో  వందకు పైగా భూదందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అతనికి భయపడి సుమారు 20 కుటుంబాలు ఊరు విడిచాయి. అమాయక ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి వాటిని ఆక్రమించుకున్నాడు. అతని అన్న కుమారుడు యోగేశ్‌నాయక్‌ కూడా స్థానికంగా దందాకు తెరతీశాడు. స్థానిక కల్లు దుకాణం నుంచి రైస్‌ మిల్లు వరకు మామూళ్లు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. 

మా డబ్బు ఇప్పించండి 
మాకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.18 లక్షలు ఇచ్చింది. ఇందులో సగం డబ్బు కైలాస్‌ నాయక్‌కే ఇచ్చాం. మా లాంటి వాళ్ల దగ్గర ఇంత డబ్బు వసూలు చేయడం దారుణం. అధికారులు మాకు డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలి.
– పార్వతీ బాయి, సుగాలి తండా 

నేను తప్పు చేయలేదు 
తండాలో అందరూ మా రక్తసంబంధీకులే. మా కుటుంబ సభ్యులను నేను మోసం చేయను. నా జీవితంలో ఎన్నో కేసులు చూశా. వీటిని కూడా ఎదుర్కొంటా. నేను తప్పు చేశానని రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమే.
– ఆర్‌.కైలాష్‌నాయక్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement