Fake Pension Master
-
పురుషుడికి వితంతు పింఛన్
శ్రీకాకుళం ,ఇచ్ఛాపురం రూరల్: రాజకీయ ప్రయోజనాల కోసం భర్త బతికుండగానే కొంతమంది మహిళలను వితంతువులుగా మార్చేశారు అధికార పక్ష నేతలు. ఏకంగా పురుషుడికే వితంతు పింఛన్ మంజూరు చేయించేశారు. ఇది తప్పంటున్న అధికారులపై ఎదురు తిరిగారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందంటూ సామాజిక బృందాలను సైతం బెదిరించేందుకు వెనుకాడలేదు. ఇచ్ఛాపురం మండల కేంద్రంలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో జరిగిన ఈ ఘటనతో మండల స్థాయి అధికారులు సైతం బెంబేలెత్తిపోయారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, స్కాలర్షిప్లు (2016 అక్టోబర్ నుంచి 2017 డిశంబర్ వరకు) పనులపై సామాజిక తనిఖీ బృందాలు వారం రోజుల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదికలో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. అరకబద్ర గ్రామానికి చెందిన సాడి వరలక్ష్మీ మూడేళ్ల నుంచి చెన్నైలో ఉంటుండగా, ఆమెకు నెలనెలా వితంతు పింఛన్ ఇస్తున్నట్లు, ఈ మేరకు రూ.40వేలను స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన మంగి ఈశ్వరరావు భార్య మంగి రమణమ్మ(28)ను వితంతుగా మార్చేసి రూ.14వేలు పింఛన్ తీసుకున్నట్లు సామాజిక బృందం గుర్తించింది. ఈ విషయం సామాజిక బృందం గుర్తించిన వరకు సదరు బాధితురాలికి తెలియకపోవడం గమనార్హం. బరంపురం పంచాయతీలో మృతి చెందిన బేపల పేరమ్మ, గుజ్జు చంద్రమ్మతో పాటు భర్తలు ఉన్న మరో పది మందికి వితంతు పింఛన్ వస్తున్నట్లు వెల్లడించారు. లొద్దపుట్టి, కొఠారీ గ్రామాలకు చెందిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు వికలాంగ, వితంతు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తించారు. లొద్దపుట్టి గ్రామానికి చెందిన పురుషుడు సాడి వాసుకు వితంతు పింఛన్ వస్తున్నట్లు బహిర్గతమైంది. కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ తల్లికి పింఛన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిది మంది మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ వారికి కూడా పింఛన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. ఇదే పరిస్థితి 21 పంచాయతీల్లో ఉందంటూ సామాజిక బృందం పేర్లతో సహా వెల్లడించడంతో ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, జెట్పీటీసీ అంబటి లింగరాజు, ఏఎంసీ చైర్మన్ సాడి సహదేవ్‌లు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం తమదని, పేదవారు కావడంతోనే అనర్హులను అర్హులుగా పరిగణించి ప్రభుత్వ పథకాలు కేటాయిస్తున్నామంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో జిల్లా అధికారులు డీఆర్డీఏ ఏపీడీ డీఎస్ఆర్ మూర్తి, డ్వామా ఏపీడీ అప్పలసూరి, విజిలెన్స్ అధికారి వెంకటరమణలు మౌనంగా ఉండిపోయారు. ఈ సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాల్లో 90 శాతం గత ఏడాది నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన సైతం మిన్నకుండిపోవడంతో మళ్లీ అవే సమస్యలు ఈ సామాజిక వేదికలో పునరావృత్తమయ్యాయి. కార్యక్రమంలో ఎస్ఆర్పీ ఈ పున్నంనాయుడు, ప్రత్యేకాధికారి బావన లవరాజు, ఎంపీడీఓ హనుమంతు సత్యం, ఎపిఓ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు. -
మరో నకిలీ మాస్టర్ అరెస్టు
♦ ఇప్పటి వరకు ఐదుగురు గుర్తింపు ♦ రూ.1.60 కోట్ల మేర కుంభకోణం ♦ మిగిలిన వారిని త్వరలో ♦ పట్టుకుంటాం : విజిలెన్స్ సీఐ పామర్రు : విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో మరో నకిలీ పింఛన్ మాస్టర్ దొరికారని విజిలెన్సు సీఐ ఎన్.శ్రీసాయిఅపర్ణ తెలిపారు. పామర్రుశివాలయం వీధిలో నివసించే నకిలీ మాస్టర్ యండూరి సాయిబాబుని ఆమె గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ ఎస్పీ రవీంద్రనాథ్, డీఎస్పీ పాల్‌తో కూడిన టీమ్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల విభాగంలో సర్వీసు చేయకుండా, ఉద్యోగ విరమణ పొందినట్లు డాక్యుమెం ట్లను తయారుచేసి, 15 ఏళ్లుగా పింఛన్‌పొందుతున్న వారి కోసం దాడులు నిర్వహిస్తున్నామని తెలి పారు. పామర్రుకు చెందిన యండూరి సాయిబాబు గతంలో హనుమంతపురంలో ఉండి నాలుగేళ్ల క్రితం నుంచి పామర్రులోని పెదమద్దాలి రోడ్డులోని శివారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఆయన హోమియో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. రిటైర్డు హెచ్ఎం కె.రంగరామానుజాచార్యులు 17 ఏళ్ల క్రితం ఆటోలో పరిచయమయ్యాడని, అతనే తన ఇంటికి వచ్చి పెన్షన్ పత్రాలు తయారు చేసి వాటిపై సంతకాలు చేయించి ప్రతినెలా పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారని సాయిబాబు తెలిపారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ సౌకర్యాలు, గ్రాట్యుటీకి సంబంధించిన పెద్ద మొత్తాలను మొవ్వ ట్రజరీ కార్యాలయంలో క్యాషియర్ నుంచి తీసుకునేలా చేశారని, ఇందుకు గానూ రంగరామానుజాచార్యులకు నెలకు పెన్షన్ నుంచి 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు సాయిబాబు తెలిపారని చెప్పారు. సాయిబాబు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో సెంకటరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001 అక్టోబర్‌లో ఉద్యోగవిరమణ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని, నవంబర్ నుంచి ప్రతి నెలా పింఛన్ సాయిబాబు పొందుతున్నాడని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు సాయిబాబు రూ.38 లక్షల వరకు పెన్షన్‌గా తీసుకున్నట్లు తేలిందన్నారు. సాయిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి పెన్షనర్ బుక్, బ్యాంకు అకౌంట్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, సాయిబాబుకు రూ.31,344 పింఛన్ వస్తోందని పేర్కొన్నారు. ఆర్ఆర్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు ఐదుగురు నకిలీ టీచర్లను అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటికి రూ.1.60 కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. స్వచ్ఛందంగా ముందుకురావాలి రంగరామానుజాచార్యుల వలలో పడి, అక్రమంగా పింఛన్ పొందుతున్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, వివరాలు తెలియజేస్తే తక్కువ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలి పారు. విజయవాడ ఏలూరు రోడ్డు, వినాయక థియేటర్ వద్ద గల విజిలెన్సు ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలపాలని సూచించారు. కార్యాలయం ఫోన్ నంబరు 0866–2453757లో కూడా వివరాలు తెలపొచ్చని పేర్కొన్నారు. రామానుజాచార్యులు కుమార్తె ద్వారా నకిలీ సర్టిఫికెట్‌ట్లు రంగరామానుజాచార్యులు కుమార్తె కె.పద్మలత పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా నకిలీ విశ్రాంత ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను గజిటెడ్ హోదాలో అందజేస్తున్నట్లు సమాచారం ఉన్నదని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలిపారు. దాడిలో విజిలెన్సు ఎస్ఐ సత్యనారాయణ, వీఆర్వో లంకపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు.