డీఆర్‌డీఏ ఏపీడీతో వాగ్వాదానికి దిగిన జెట్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు
శ్రీకాకుళం ,ఇచ్ఛాపురం రూరల్: రాజకీయ ప్రయోజనాల కోసం భర్త బతికుండగానే కొంతమంది మహిళలను వితంతువులుగా మార్చేశారు అధికార పక్ష నేతలు. ఏకంగా పురుషుడికే వితంతు పింఛన్ మంజూరు చేయించేశారు. ఇది తప్పంటున్న అధికారులపై ఎదురు తిరిగారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందంటూ సామాజిక బృందాలను సైతం బెదిరించేందుకు వెనుకాడలేదు. ఇచ్ఛాపురం మండల కేంద్రంలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో జరిగిన ఈ ఘటనతో మండల స్థాయి అధికారులు సైతం బెంబేలెత్తిపోయారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు (2016 అక్టోబర్ నుంచి 2017 డిశంబర్ వరకు) పనులపై సామాజిక తనిఖీ బృందాలు వారం రోజుల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదికలో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. అరకబద్ర గ్రామానికి చెందిన సాడి వరలక్ష్మీ మూడేళ్ల నుంచి చెన్నైలో ఉంటుండగా, ఆమెకు నెలనెలా వితంతు పింఛన్ ఇస్తున్నట్లు, ఈ మేరకు రూ.40వేలను స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన మంగి ఈశ్వరరావు భార్య మంగి రమణమ్మ(28)ను వితంతుగా మార్చేసి రూ.14వేలు పింఛన్ తీసుకున్నట్లు సామాజిక బృందం గుర్తించింది. ఈ విషయం సామాజిక బృందం గుర్తించిన వరకు సదరు బాధితురాలికి తెలియకపోవడం గమనార్హం. బరంపురం పంచాయతీలో మృతి చెందిన బేపల పేరమ్మ, గుజ్జు చంద్రమ్మతో పాటు భర్తలు ఉన్న మరో పది మందికి వితంతు పింఛన్ వస్తున్నట్లు వెల్లడించారు. లొద్దపుట్టి, కొఠారీ గ్రామాలకు చెందిన ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలకు వికలాంగ, వితంతు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తించారు.
లొద్దపుట్టి గ్రామానికి చెందిన పురుషుడు సాడి వాసుకు వితంతు పింఛన్ వస్తున్నట్లు బహిర్గతమైంది. కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ తల్లికి పింఛన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిది మంది మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ వారికి కూడా పింఛన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు. ఇదే పరిస్థితి 21 పంచాయతీల్లో ఉందంటూ సామాజిక బృందం పేర్లతో సహా వెల్లడించడంతో ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, జెట్పీటీసీ అంబటి లింగరాజు, ఏఎంసీ చైర్మన్ సాడి సహదేవ్‌లు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం తమదని, పేదవారు కావడంతోనే అనర్హులను అర్హులుగా పరిగణించి ప్రభుత్వ పథకాలు కేటాయిస్తున్నామంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో జిల్లా అధికారులు డీఆర్‌డీఏ ఏపీడీ డీఎస్‌ఆర్ మూర్తి, డ్వామా ఏపీడీ అప్పలసూరి, విజిలెన్స్ అధికారి వెంకటరమణలు మౌనంగా ఉండిపోయారు. ఈ సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాల్లో 90 శాతం గత ఏడాది నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన సైతం మిన్నకుండిపోవడంతో మళ్లీ అవే సమస్యలు ఈ సామాజిక వేదికలో పునరావృత్తమయ్యాయి. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీ ఈ పున్నంనాయుడు, ప్రత్యేకాధికారి బావన లవరాజు, ఎంపీడీఓ హనుమంతు సత్యం, ఎపిఓ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment