అవినీతి భాండాగారం
కేజీబీవీలకు సరుకుల కొనుగోళ్లలో చిలక్కొట్టుడు
తప్పుడు బిల్లులతో మాయాజాలం
వాటిలోనూ యథేచ్ఛగా దిద్దుబాట్లు
తక్కువ సరుకు కొనుగోలు..
ఎక్కువ మొత్తానికి బిల్లు
డీలర్లతో కేంద్రీయ భాండార్ అధికారుల కుమ్మక్కు
ఇష్టారాజ్యంగా చెల్లింపులకు సిఫారసులు
మీరు ఈరోజు ఒక షాపుకెళ్లి ఏదో వస్తువు కొన్నారు. దానికి రసీదు తీసుకున్నారు. దానిపై ఒక నెంబర్ ఉంటుంది...మరుసటి రోజు అదే షాపునకు వెళ్లి ఇంకేదో వస్తువు కొని రసీదు అడిగితే ఏ నెంబరు రసీదు ఇస్తారు.. సహజంగా నిన్నటి రసీదు తర్వాతి నెంబరే వస్తుంది కదా!..కానీ దాని ముందు నెంబరుతో రసీదు ఇస్తే.. ఖచ్చితంగా అక్కడేదో మతలబు జరుగుతోందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు సరుకుల సరఫరాలో అదే జరుగుతోంది..! కావాలంటే ఈ బిల్లులు చూడండి.. జూన్ 4వ తేదీన తీసుకున్న సరుకులకు 0885 నెంబర్ బిల్లు ఇచ్చారు..అక్కడికి 14 రోజుల తర్వాత అంటే.. జూన్ 18న తీసుకున్న సరుకులకేమో దానికి ముందున్న 0880 బిల్లు ఇచ్చారు.అదెలా సాధ్యం.. అసలక్కడేం జరుగుతోంది?.. అన్న అనుమానాలొస్తున్నాయి కదూ..కానీ ఘనత వహించిన కేంద్రీయ భాండార్ అధికారులకు మాత్రం అటువంటి అనుమానాలు లేశమాత్రమైనా కలగడం లేదు. వాటిని యథాతథంగా చెల్లింపులకు సి‘ఫార్సు’ చేసేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఎ) పరిధిలో కేంద్రీయ భాండార్ సరకులు సరఫరా చేస్తున్న అన్ని కేజీబీవీల్లోనూ ఇదే తతంగం నడుస్తోంది. తేదీలు, బిల్లు నెంబర్లలో మాయాజాలమే కాదు.. ఏకంగా బిల్లుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు కూడా చోటుచేసుకుంటున్నాయి. అదేమని అడిగితే ఏదో పొరపాటున జరిగిందని తేలిగ్గా తీసిపారేస్తారు. ఈ తంతు ఒక్క నెలకో, ఏ రెండు కేజీవీబీలకో పరిమితం కాలేదు. అసలు కేంద్రీయ భాండార్ బండారమేమిటో ఓసారి పరిశీలిస్తే...
రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)కు విశాఖలో ఉన్న కేంద్రీయ భాండార్ పాలు, కూరగాయలు మినహా అన్ని నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తుంది. అదే విధంగా జిల్లాలోని 18 కేజీబీవీలకు ప్రతి నెలా కేంద్రీయ భాండార్ సరకులు అందిస్తోంది. ఈ మేరకు ముగ్గురు రిజిస్టర్ట్ డీలర్లను నియమించుకుంది. వారు అనకాపల్లి, యలమంచిలి, విశాఖ పూర్ణామార్కెట్లోని హోల్సేల్ దుకాణాల్లో సరుకులు కొని కేజీబీబీలకు సరఫరా చేస్తారు. ఆ బిల్లులను కేంద్రీయ భాండార్కు అందిస్తే.. సదరు భాండార్ అధికారులు ఆ బిల్లులను పరిశీలించి చెల్లింపుల కోసం సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)కు పంపిస్తారు. ఎస్ఎస్ఏ అధికారులు ఆ బిల్లు మొత్తాలను చెక్కుల రూపంలో కేంద్రీయ భాండార్ ఖాతాలో జమ చేస్తారు. అయితే చెప్పినంత సవ్యంగా ఇదంతా జరగడంలేదు. బిల్లుల చెల్లింపులో భాండార్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. తప్పుడు తేదీలతో బిల్లులు, దిద్దుబాటు బిల్లులను క్లెయిమ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఒక్కో కేజీబీవీకి నెలకు రూ. 60 వేల నుంచి రూ. 70వేల సరకులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా జిల్లాలోని 18 కేజీబీవీలకు ప్రతి నెలా రూ. 10 లక్షలకు పైగానే కొనుగోళ్లు చేస్తున్నారు. డీలర్లు హోల్సేల్ షాపుల వద్ద తక్కువ మొత్తంలో సరుకులు కొని ఎక్కువ మొత్తానికి బిల్లులు రాయించి కేంద్రీయ భాండార్కు పంపిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భాండార్ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా డీలర్లు ఇచ్చిన తప్పుడు బిల్లులనే చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తిరోగమన పథంలో ఉన్న ఫొటోల్లోని రెండు బిల్లులు, వాటిలోని దిద్దుబాట్లు వీటిని బలపరుస్తున్నాయి.
ఎక్కడో పొరపాటు జరిగింది
ఇదే విషయాన్ని సాక్షి ప్రస్తావిస్తే.. ‘వాస్తవానికి ఎక్కడో పొరపాటు జరిగింది. అందుకే బిల్లు నెంబర్లలో తేడా వచ్చింది. అంతే కానీ అవినీతి జరగలేదు. డీలర్లతో కుమ్మక్కు అయ్యామన్న వాదనల్లో నిజం లేదు. ప్రతి బిల్లు వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తాం’.. అని కేంద్రీయ భాండార్ డివిజనల్ ఇన్చార్జి జి.నరేంద్రకుమార్ చెప్పారు.